Tuesday, April 13, 2021

కాళేశ్వ‌రం కొత్త నడ‌క‌..

హైదరాబాద్‌/గజ్వేల్‌, : అద్భుతం.. ఆవిష్కృతమైంది. గోదావరి జలాలు మంజీరా నదిలోకి పరుగులు పెట్టాయి. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం అవుసులపల్లి వద్ద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటిని విడుదల చేయగా.. కాళేశ్వర గంగ హల్ది వాగులోకి పరవళ్లు తొక్కుతోంది. ఎండాకాలంలోనూ సాగు నీటిని అందించేలా సంగారెడ్డి కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల పరిధిలో చెరువులు జలకళ సంతరించు కోనున్నాయి. తక్షణం 14 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. -తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా అభివృద్ధి చేయాలనే భగీరథ తలంపుతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్‌ కార్యాచరణ మంగళవారం మైలురాయిని దాటింది. ఇప్పటికే మేడిగడ్డ నుండి మిడ్‌మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు.. అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్‌కు చేరుకున్నాయి. మంగళవారం నాటి జలాల విడుదల కార్యక్రమం ద్వారా కొండపోచమ్మ సాగర్‌ జలాలను మొదట హల్ది వాగులోకి వదిలి, మంజీరానది ద్వారా నిజాంసాగర్‌కు తరలించే కార్యక్రమం ముఖ్యమంత్రి
చేపట్టారు. తదనంతరం కొండపోచమ్మ సాగర్‌ జలాల ను గజ్వేల్‌ నుంచి సిద్దిపేట జిల్లాలోని 20 చెరువులు నింపేందు కు వదిలారు. దీంతో కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.
సీఎం విజయసంకేతం
మంగళవారం ఉదయం ప్రత్యేక బస్సులో ప్రగతిభవన్‌ నుండి సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం అవుసులపల్లికి చేరు కున్న సీఎం కేసీఆర్‌.. అక్కడ కాళేశ్వర జలాలకు ప్రత్యేక పూ జలు చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి జలా లను విడుదల చేశారు. ఈ జలాలు సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్ది వాగు ద్వారా నిజాంసాగర్‌కు చేరుకుంటాయి. అవుసు లపల్లి వద్ద గోదారమ్మకు సీఎం కేసీఆర్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డి పూజలు నిర్వహిం చారు. అనంతరం నీటిని వదులుతున్న అద్భుత దృశ్యాలను చూసి.. ఈలలువేస్తూ, హర్షాతిరేకాలు ప్రకటి స్తున్న రైతులను చూసి సీఎం కేసీఆర్‌ విజయ సంకేతం చూపిం చారు. కాళేశ్వరం జలాలు మంజీరాలోకి పరుగులు పెట్టడం పట్ల హర్షం ప్రకటించారు. ఈ నీళ్లు అవుసులపల్లి నుంచి మొదట వర్గల్‌లోని బంధం చెరువుకు కాళేశ్వరం నీరు చేరు కుంటాయి. అక్కడి నుంచి అదే గ్రామంలోని పెద్దచెరువు, శాఖారంలోని ధర్మాయి చెరువు, అనంతరం అంబర్‌పేటలోని ఖాన్‌చెరువు వరకు గొలసుకట్టు ద్వారా నీరు ప్రవహిస్తుంది. ఖాన్‌చెరువు నుంచి హల్ది వాగులోకి.. హల్ది నుంచి మంజీరా నదిలోకి.. అక్కడి నుంచి నిజాంసాగర్‌కు కాళేశ్వరం జలాలు చేరుతాయి.
హల్ది వాగుకు జల సవ్వడి
కాళేశ్వరం ప్రాజెక్టు జలాలను ప్రస్తుతం సంగారెడ్డి కాల్వ నుంచి నిజాంసాగర్‌కు విడుదల చేసినా ఇది తాత్కాలికమే. కాళేశ్వరం పథకంలో అతిపెద్ద రిజర్వాయర్‌ మల్లన్నసాగర్‌ పనులు పూర్తి కావడానికి మరో రెండు, మూడు నెలలు పట్టే అవకాశం ఉండడంతో.. ప్రత్యామ్నాయంగా కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దివాగు.. ద్వా రా నిజాంసాగర్‌కు నీరు తరలిస్తున్నారు. మల్లన్నసాగర్‌ రిజ ర్వాయర్‌కు ఐదు ఓటీ స్లూయిస్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అం దులో ఒకటి సింగూరు ప్రాజెక్టుకు వెళ్లే కాల్వ.. ఈ తూము వద్ద నాలుగు గేట్లు ఉంటాయి. ఇక్కడి నుంచి సింగూరు ప్రాజె క్టుకు నీటిని పంపిస్తారు. ఈ కాల్వ కెపాసిటీ ఆరువేల క్యూసెక్కులు ఉంటుంది. ఇదే కాల్వ నుంచి హల్దివాగుకు నీటిని విడుదల చేస్తారు.
నిజాంసాగర్‌ ఆయకట్టుకు బేఫికర్‌
ప్రస్తుతం నిజాంసాగర్‌లో 7.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. యాసంగి పంటలకు మరో తడి ఇవ్వడానికి 1.2 టీఎంసీలు విడుదల చేయనున్నారు. హల్ది వాగు ద్వారా మరో నాలుగు టీఎంసీల నీటిని అందించ నున్నా రు. నిజాం సాగర్‌లో మొత్తం నీటి నిలువ 10 టీఎంసీలకు చేరనుంది. వచ్చే వర్షాకాలంలో వానలు సకాలంలో రాకపోయినా.. ఈ నీటితో పంటలు సాగు చేసుకునేలా అధికా రులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
20 చెరువులకు జలకళ
మర్కూక్‌ మండలం పాములపర్తి వద్ద గజ్వేల్‌ కాలువలోకి సీఎం కేసీఆర్‌ నీటిని విడుదల చేశారు. గజ్వేల్‌ కాలువ ద్వారా మర్కూక్‌, గజ్వేల్‌ మండలాల్లోని ఈ జలాలు పరిసర ప్రాంతాల్లోని పాములపర్తి చెరువు, పాతురు చెరువు, చేబర్తి చెరువు, ప్రజ్ఞాపూర్‌, గజ్వేల్‌, కేసారం, బయ్యారం, జాలియామా తదితర 20 చెరువులును నింపుతాయి. ఈ కార్యక్రమాల్లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, గంగాధర్‌ గౌడ్‌, ఫరీదుద్దీన్‌, ఫరూఖ్‌ హుస్సేన్‌, రాజేశ్వర్‌ రావు, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్‌, గణష్‌ గుప్తా, హన్మంత్‌ షిండే, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, సీహెచ్‌ మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, సీఎం కార్య దర్శులు స్మితా సబర్వాల్‌, నీటి పారుదలశాఖ ముఖ్య కార్య దర్శి రజత్‌ కుమార్‌, ఈఎన్సీ మురళీధర్‌రావు, కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్‌, సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డి, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, సంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, సిద్దిపేట జడ్పీ చైర్‌పర్సన్‌ రోజా రాధాకృష్ణ శర్మ, మెదక్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత శేఖర్‌, గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అన్నపూర్ణ, ఎలక్షన్‌ రెడ్డి, జడ్పీటీసీ బాలు యాదవ్‌, అవుసులపల్లి సర్పంచ్‌ జి.కరుణాకర్‌, ఎంపీటీసీ రాధ ప్రవీణ్‌, మర్కూక్‌ మండలం పాములపర్తి గ్రామ సర్పంచ్‌ తిరుమల రెడ్డి, ఎంపీపీ పాండు గౌడ్‌, జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, పీఏసీఎస్‌ చైర్మన్‌ బట్టు అంజిరెడ్డి పాల్గొన్నారు.
మురిసిన ముఖ్యమంత్రి
సంగారెడ్డి కాల్వకు నీళ్ళు వదిలే సందర్భంలో పెద్ద ఎత్తున హాజరైన రైతులు.. సంతోషాన్ని ప్రకటిస్తూ సీఎంకు అభివాదాలు చేయడంతో సీఎం సంతోషపడ్డారు. ఆనందంతో రైతులకు చేతులూపారు. సీఎం స్పందన చూసి రైతులు మరింత తన్మయత్వానికి గురయ్యారు. కాళేశ్వర గంగ మంగళవారం నేర్చిన కొత్త నడక.. గోదావరి జలాలు ఎన్నడూచూడని రైతాంగంలో కొత్త ఆశలు కలిగించి వెలుగులు నింపింది. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా రైతులకు అభివాదం చేశారు. దారిపొడవునా.. ముఖ్యమంత్రికి రైతు కుటుంబాలు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. అపర భగీరధుడు అంటూ జేజేలు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News