Wednesday, May 22, 2024

కేంద్రంలో చేత‌కాని ప్ర‌భుత్వం : స‌తీష్ రెడ్డి

ఎక్కడైనా రైతులు పంటలు పండకా, సరైన ధర రాక ఇబ్బందులు పడుతుంటరు.. కానీ…మన తెలంగాణ రైతుల పంటను కేంద్రం కొనకుండా ఇబ్బందులు పెడుతుందని… మన రైతులు పండించిన‌ పంటను కొనలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం కేంద్రంలో ఉందని టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై. సతీష్ రెడ్డి అన్నారు. మీ ప్రజలకు నూకలు అలవాటు చేయండి అంటూ తెలంగాణను అవమానపర్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయనకు నూకలు పార్సిల్ చేశారు టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై. సతీష్ రెడ్డి. టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ….. రైతులకు కావాల్సిన అన్ని వసతులు నీళ్లు, కరెంటు, విత్తనాలు, ఎరువులు, సబ్సిడీలు, సాగు పెట్టుబడి కోసం రైతుబంధు లాంటి వసతులన్నీ రాష్ట్రప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. కానీ..అన్నీ రాష్ట్రమే చూసుకున్నా.. పండిన పంటను కొనడానికి కూడా కేంద్రానికి చేతనైతలేదన్నారు. అదీగాక తెలంగాణ వడ్లను కొనుగోలు చెయ్యమని మంత్రుల బృందం ఢిల్లీకి పోతే…ఆ పీయూష్ గోషల్ మన తెలంగాణ రైతులను, తెలంగాణ ప్రజలను కించపర్చే విధంగా మీ ప్రజలకు నూకలు అలవాటు చేయండి అని తన ఉత్తరాధి అహంకారాన్ని వెల్లగక్కారన్నారు. దేశంలో రైతులు పండించిన ప్రతీ గింజ కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేన‌న్నారు. అందుకే కదా ఎఫ్ సీఐని పెట్టింది… అందుకే కదా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తెచ్చింది… ఏమన్నా అంటే దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని అంటారు… అన్ని నిల్వలే ఉంటే…. దేశంలో ఆకలి చావులు ఎందుకు తగ్గట్లేద‌ని ప్ర‌శ్నించారు. రీసెంట్ గా వచ్చిన హంగర్ ఇండెక్స్ లో భారతదేశం చివరిస్థానంలో ఎలా ఉంది ? అని వై సతీష్ రెడ్డి ప్రశ్నించారు.


తెలంగాణ లాంటి కొత్త రాష్ట్రంలో వ్యవసాయం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే ప్రోత్సహించాల్సింది పోయి….కాళ్లల్ల‌ కట్టె ప‌ట్టినట్టు మేం బాయిల్డ్ రైస్ కొనం, రా రైసే కొంటామని అదే మాట చెప్పడం సిగ్గు చేటన్నారు. నువ్వు రాజకీయంగా మమ్మల్ని ఎంత విమర్శించినా ఊరుకున్నాం కానీ…. తెలంగాణ జోలికి వచ్చి, తెలంగాణను కించ‌పర్చే విధంగా నూకలు తినమన్న మీ బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినయ్… తమ అధినాయకుల పిలుపుకోసం ఎదురు చూస్తున్నాం… ఏప్రిల్ 2 తర్వాత మీతో నూకలు తినిపిస్తమ్… మిమ్ములను కేంద్రం కుర్చీలకెళ్లి నూకిందాకా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణకు ఉద్యమాలు కొత్తకాదు, పోరాటడం కొత్త కాదు… అది తమ నెత్తురులోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గతంలో తెలంగాణతో గోక్కున్నోళ్లంతా ఏడున్నరో ఓసారి యాదికి తెచ్చుకోవాలని తీవ్రంగా హెచ్చరిస్తూ…. ఆ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు తాము ఈ నూకలను పార్సిల్ చేస్తున్నాం…. త‌మ తెలంగాణ బిడ్డలను తినమన్న నూకలు మీకు పంపిస్తున్నాం…..వాటిని తింటావో లేకపోతే నీ తద్దినానికే వాడుకుంటవో మీ ఇష్టమని సతీష్ రెడ్డి హెచ్చరించారు. మరోసారి తెలంగాణ తిండిని ఎక్కిరిస్తే చీరి చింతకు కడ్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు సతీష్ యాదవ్, జగన్ మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తెరాస విద్యార్థి విభాగం నాయకులు షఫీ, తెరాస సోషల్ మీడియా సైనికులు అక్షయ్, అనిల్ గౌడ్, సంతోష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement