Tuesday, May 28, 2024

Exclusive – సార్‌.. సార్‌..ప్లీజ్ స‌ర్‌! ఏపీ ఆఫీసర్ల గేర్ మారిందోచ్…

ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మలుపులు తిరుగుతున్నాయి. పోలింగ్ దశ ముగిసింది. రాజకీయ అలజడి అట్టుడికింది. దర్యాప్తు బృందం తన నివేదికను డీజీపీకి అందజేయగా.. ఈ రిపోర్టు ఈసీకి చేరనుంది. ఎంత మంది పోలీసు అధికారుపై వేటు పడుతుందో, హెచ్చరికలు జారీ అవుతామో.. అర్థం కాని స్థితి. ఇక.. గెలుపుపై అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్ష కూటమి సొంత సర్వేలతో మోత మోగిస్తుంటే విపక్ష నేతతో పోలిస్తే అధికారపక్ష అధినేత నోటి నుంచి గెలుపు మాట బలంగానే వినిపిస్తోంది. ఇన్ని సంక‌టాల న‌డుమ అధికారులు మాత్రం చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని మ‌చ్చిక చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు.. సార్‌, సార్‌.. ప్లీజ్ సర్‌.. అంటూ మాట్లాడేందుకు తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు.


చంద్ర‌బాబుతో ట‌చ్‌లోకి
లాబీయింగ్ షురూ
లోకేశ్‌ రెడ్ బుక్ అలజడి
లూప్ లైన్‌లోని టీమ్‌లో సందడి
బీజేపీ నేత గడపల్లోనూ కర్చీఫ్
పవర్ స్టార్ ప్రసన్నతే లక్ష్యం
లీడ‌ర్ల చెంత‌న అధికారుల‌ క్యూ

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఏపీ సీఎం జగన్.. విపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ విదేశీ పర్యటనలో ఉన్నారు. మరోవైపు పోలింగ్ టర్న్ అవుట్ మీద విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. పోలింగ్ జరిగిన తీరు.. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడి ఉంటాయన్న అంశంపై అధికార.. విపక్ష వర్గాలు లెక్కలు కడుతున్నాయి. అకస్మాత్తుగా రెండు, మూడు రోజులుగా ఏపీ అధికారుల వ్యవహార శైలిలో మార్పులు కొత్త అర్థాలిస్తున్నాయి. అత్యంత కీలక స్థానాల్లోని కొందరు అధికారులు విపక్ష నేత చంద్రబాబుతో టచ్ కోసం తహతహలాడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజల నాడిని అంచనా వేసిన సదరు అధికారులు..టీడీపీకే అధికారం దక్కుతుందనే భావనలోకి వచ్చినట్టు తెలుస్తోంది.

- Advertisement -

బాబూ.. మేమూ మీ వోళ్లమే..

గత ప్రభుత్వంలో లూప్ లైన్ లో మూగ వేదన అనుభవించిన అధికారులే కాదు.. ఇప్పటి ప్రభుత్వంలో కీలక హోదాల్లో పని చేసిన అధికారులూ చంద్ర‌బాబు ముందు సాగిల‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. తమపై టీడీపీ ముద్ర వేసి పక్కకు పెట్టారని.. తమ సంగతిని చూడాలన్న సందేశాల్ని పంపుతున్న‌ట్టు అవ‌గ‌తం అవుతోంది. ప్రభుత్వ విధానాలకు తగ్గట్టుగా తాము నడుచుకుంటామని.. తమకు కీలక పోస్టింగులు ఇవ్వాలన్న అంశాన్ని తెస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇదే తరహా సందేశాన్ని జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు సైతం కొందరు ఉండటం గమనార్హం. తాము ఉద్యోగ విరమణకు దగ్గర్లో ఉన్నామని.. కనీసం చివర్లో కీలర పదవి నుంచి రిటైర్ అయితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. తాను టీడీపీకి.. చంద్రబాబుకు వ్యతిరేకం కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకోరటం ఆసక్తికరంగా మారింది. తమను టీడీపీ వ్యతిరేకుల జాబితాలో చేర్చవద్దన్న విషయాన్ని కొందరు నేతల ద్వారా అధినేతకు రాయబారాలు చేస్తున్న వైనం ఇప్పుడు ఎక్కువైంది.

బీజేపీ గుమ్మంలో.. కర్చీఫ్

కొందరు అధికారులు ఓట్ల లెక్కింపునకు ముందుగానే ప్రయత్నాలు చేసుకోవటంతో తమకు అధిక ప్రాధాన్యం లభిస్తుందన్న భావనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కొందరు అధికారులు బీజేపీ ముఖ్యనేతలతో ఫోన్లు చేయించటం ఇప్పుడో కొత్త పరిణామంగా భావించాలి.. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అధికారుల్ని ఎప్పుడూ టార్గెట్ చేయలేదని.. కానీ గడిచిన ఐదేళ్ల అనుభవ పాఠాలతో మాత్రం ఈసారి భిన్నంగా వ్యవహరించాలన్న ఆలోచనతో ఉండాలని టీడీపీ అగ్రనేతలు భావిస్తున్నారు.

పవర్ స్టార్ ప్రసన్నతే లక్ష్యంగా..

ఇక జనసేనాధిపతి ప్రసన్నత కోసం కొందరు కులం కార్డులు సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్తో అత్యంత సాన్నిహిత్యం కలిగిన నేతల వివరాలను సేకరిస్తున్నారు. ఇటు తెలుగుదేశం, అటు బీజేపీ శిబిరాల్లో పవర్ స్టార్ ప్రాభల్యం మీదనే ఆఫీసర్లలో చర్చ జరుగుతోంది. జనసేనాని మాత్రమే తమను కాపాడగలరని ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఎలాగైనా ఆయన ఆదరణ కోసం క్యూ కడుతున్నారు. తాము ప్రభుత్వంలో ఉండగా.. ఏనాడూ జనసేనకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని చెబుతున్నారు. ఇక పోలీసుల్లో అలజడి అంతాయింతా కాదు. మనోహర్ నాయుడు లాబీయింగ్ తో తమ కష్టాలు గట్టెక్కుతాయని ఆశిస్తున్నారు.

వామ్మో రెడ్ బుక్…ప్చ్

ఇప్పటికే రెడ్ బుక్ పేరుతో తమను ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లను లోకేష్ రాయటం.. ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పటం తెలిసిందే. తమకు టచ్ లోకి వస్తున్న అధికారులకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా గుంభనంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. 2019లో తమకు లభించిన సీట్ల కంటే ఎక్కువ సీట్లతో విజయాన్ని సాధిస్తామని సీఎం జగన్ చెబుతుంటే.. అందుకు భిన్నంగా అధికారుల లోగుట్టు లాబీయింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై మరింత ఉత్కంఠతపెంచుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement