Monday, June 24, 2024

All Set – ఓరుగ‌ల్లుకు ఎయిర్‌ జ‌ర్నీ…. విమానాల ల్యాండింగ్‌కు స‌న్న‌ద్ధం

వీడుతున్న చిక్కుముడులు
ప్రాంతీయ విమానాశ్ర‌యంపై స‌ర్కారు దృష్టి
చ‌ర్య‌లు వేగ‌వంతం చేసిన సీఎం రేవంత్‌
అద‌నంగా 253 ఎక‌రాల కేటాయింపు
జీఎమ్మార్‌, ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ నుంచి రాని ప‌ర్మిష‌న్‌
విస్త‌ర‌ణ‌కు 1200 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా
స‌మీక్ష‌కు రానున్న ఎయిర్‌పోర్ట్ అథారిటీ బృందం

వరంగల్‌ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో ఎయిర్​ పోర్ట్స్​ అథారిటీ వేచి చూసే ధోరణితో ఉంది. వరంగల్‌ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించటంతో ఏఏఐ అధికారుల్లో కదలిక వచ్చింది. ఎయిర్‌పోర్ట్స్‌ నిర్మాణానికి వీలుగా ప్రస్తుతం ఉన్న 706 ఎకరాల భూమికి అదనంగా 253 ఎకరాలు కేటాయిస్తూ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందుగానే మునుపటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

స‌ర్వేపై రాని స్ప‌ష్ట‌త‌..

హైదరాబాద్‌కు చెందిన జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్‌తో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. భూమి కేటాయింపు ఉత్తర్వుల నేపథ్యంలో ఏఏఐ అధికారులు వరంగల్‌ విమానాశ్రయం పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవటంతో అయోమయం నెలకొంది. విమానాశ్రయ నిర్మాణం కోసం పరిశీలన చేశారా? మరేదైనా కారణాలతో సర్వే చేశారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

విస్త‌ర‌ణ‌కు 1200 కోట్ల ఖ‌ర్చు అంచ‌నా..

విమానాశ్రయాన్ని దశల వారీగా విస్తరించాలని మునుపటి ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఏటీఆర్‌ స్థాయి చిన్న విమానాల రాకపోకలకు వీలుగా నిర్మించాలనుకున్నారు. దీనికి అనుగుణంగా మునుపటి ప్రభుత్వం 253 ఎకరాలను కేటాయించింది. ఏఏఐ అధికారులు కనీసం 400 ఎకరాలు కేటాయించాలని తమ నివేదికలో వెల్లడించారు. విస్తరణకు సుమారు రూ.1,200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. అంత మొత్తాన్ని ఖర్చు చేసేందుకు అప్పటి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదని అధికారులు చెబుతున్నారు. రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లతో విమానాల రాకపోకలకు ఏర్పాట్లు చేయాలని చెప్పడమే కాకుండా, ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు స్పష్టం చేసింది. నిజానికి ఒకేసారి నిర్మాణాన్ని చేపట్టడమే అన్ని రకాలుగా ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

స‌మీక్ష చేయ‌నున్న ఎయిర్‌పోర్ట్ అథారిటీ బృందం

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయ నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేసినా, ఏ స్థాయిలో అన్నది నిర్ణయించాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్​ అమల్లో ఉంది. అది ముగిసిన తర్వాత ఈ విషయంపై సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. పూర్తి స్థాయిలో అభివృద్ధా? లేక మునుపటి ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్లడమా? అన్నది అప్పుడు ఖరారవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై సమీక్షించేందుకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారుల బృందం త్వరలో రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ బృందం వరంగల్​లోని ఎయిర్​ స్ట్రిప్​ను పరిశీలించడంతో పాటు ఉన్నతాధికారులతో చర్చలు నిర్వహించాలని నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement