Saturday, April 27, 2024

చితి మంట‌ల్లో మాన‌వ‌త్వం – దిన‌దిన‌గండంగా బతుకు జీవ‌నం

మహమ్మారి రాకతో చిన్నాభిన్నమైన సామాన్యుల కుటుంబాలు
మారిన ప్రజల బ్రతుకు చిత్రం
మంటగలుస్తున్న మానవత్వం
వైరస్‌ ఎవరికి ఎప్పుడు వస్తుందోనని జనం భయాందోళన

హైదరాబాద్‌, కరోనా రెండో వ్యాప్తితో యావత్‌ దేశంతో పాటు తెలంగాణ కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి. ఒకవైపు ఆక్సిజన్‌ లేక జనం ఆర్తనాదాలు పెడుతుంటే.. మరోవైపు ప్రభుత్వాలు మాత్రం చోద్యం చూస్తున్నట్టు మిన్నుకుండిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మానవత్వం కూడా ఆ చితిమంటల్లోనే కలిసిపోతుంది. మహమ్మారి రాకతో ప్రజల బతుకు చిత్రం మారిపోవడంతో పాటు సామాన్యుల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్న పరిస్థితి. వైరస్‌ విజృంభనతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పెడతారా, పెట్టరా.. అనేది అటుంచితే.. లాక్‌డౌన్‌ మాటవింటేనే కొన్ని వర్గాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ ప్రభావాన్ని తగ్గించాలంటే స్వీయ నియంత్రణ అవసరమని ప్రభుత్వాలు ముక్తకంఠంతో చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం ఆ విషయాన్ని పెడచెవిన పెట్టి ప్రవర్తిస్తుండడం వలనే కరోనా విస్తరిస్తుందనడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతమున్న వైరస్‌ యావత్‌ ప్రజానీకాన్ని వణికిస్తుండగా, ఇది మరికొంతకాలం మనతోనే సహజీవనం చేసేలా కనిపిస్తోంది. దీంతో క్షణక్షణం భయం భయంగా బ్రతకాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయి.

మారిన ప్రజల బ్రతుకు చిత్రం
కరోనాతో దేశ వ్యాప్తంగా ప్రజల బ్రతుకు చిత్రాలు మారిపోయాయి. తినే తిండి నుంచి కట్టే బట్ట వరకు.. అన్ని మారాయి. దీంతో పాటు ప్రజల ఆర్థిక స్థితిగతులు కూడా అంతకంతకూ మారుతుండడంతో ఆయా కుటుంబాల్లో ఆర్థిక ఆందోళనలు పెరిగిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఏం కొనాలన్నా.. తినాలన్నా ఆలోచించి ఖర్చు చేస్తున్నారు. రోజు కూలి చేసి జీవితాన్ని నెట్టుకొచ్చే వారికి పనుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట, అమీర్‌ పేట, కూకట్‌పల్లి, మాదాపూర్‌, బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12, గౌలిగూడ, ఎల్‌బి నగర్‌, ఉప్పల్‌ లాంటి కూలీల అడ్డాలో కూలి దొరక్క చాలా మంది వెనక్కి వెళుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైరస్‌ ప్రభావంతో పనులు చేయించుకునే వారు కూడా తక్కువ సంఖ్యలో కొవిడ్‌ నిబంధనల ప్రకారం తీసుకువెళ్తుండడంతో మిగతా వారికి పనిలేకుండా పోతుంది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలపై వైరస్‌ పెద్ద దెబ్బే కొడుతోంది.
ప్రస్తుతం అందరిలో వైరస్‌ ఎపుడు, ఎలా సోకుతుందోనన్న భయం నెలకొంది. ఈ భయంతో సగం అనారోగ్యానికి గురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. వైరస్‌ సోకిన వారు కూడా తీవ్రమైన భయాందోళనలకు గురవడం వలన కూడా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. టెస్ట్‌లకు ఆలస్యం కావడంతో అనుమానితులు బయట తిరగడంతో కూడా పాజిటివ్‌ల సంఖ్య ఎక్కువగా రావడానికి కారణమని తెలుస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎలా సోకుతుందోనన్న భయంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవత్వం మంటగలుస్తోంది.. కరోనాపై ఏ రోజుకారోజు అపోహలు పెరగడంతో పాటు వైరస్‌పై అవగాహన తగ్గడంతో లేనిపోని భ్రమలతో మనుషుల మధ్య దూరం పెరిగిపోతుంది. ప్రజల్లో అపో#హలు పెరగడంతో సాధారణంగా మరణించిన వారికి కూడా కరోనాను ఆపాదిస్తుండడంతో ఆ కుటుంబం మానసికంగా కుంగిపోతున్న పరిస్థితి. వైరస్‌ పట్ల చదువుకున్న వారు, చదువుకోని వారు ఒకే రకమైన ఆలోచనతో ఉండడంతో మానవత్వం సజీవ దహనం అవుతోంది. దీనికి నిదర్శనమే చనిపోయిన భార్యను.. భర్త తన భుజాలపై మోసుకెళ్లిన ఘటన. ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి అందరికి తెలిసింది.. కానీ ఇలాంటి వెలుగులోకి రాని చీకటి ఘటనలు చాలానే ఉన్నాయి. పల్లెల్లోని వారికి కొవిడ్‌ వస్తే వారిని ఎక్కడో దూరంగా ఉంచి అంటరాని వారిగా చూస్తున్న పరిస్థితులు దాపురించాయి. కరోనా వచ్చిందని తెలియగానే ఎవరికి వారే తలుపులు మూసుకుని.. అటువైపు కన్నెత్తి కూడా చూడని అధ్వాన్న స్థితిలోకి చేరారు జనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement