Monday, April 29, 2024

harassment : మహిళా కార్పొరేటర్ తో అధికార పార్టీ ఎమ్మెల్యే అర్ధరాత్రి ‘చిలిపి’ ఫోన్ కాల్స్

హైదరాబాద్ : రోజురోజుకు మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కేవలం సాధారణ మహిళలకే కాదు.. మహిళా ప్రజాప్రతినిధులకూ రక్షణ లేకుండా పోతోంది. తాజాగా రాష్ట్రంలో ఓ మహిళా కార్పొరేటర్.. ఏకంగా ఓ ప్రజాప్రతినిధి నుంచి వేధింపులు ఎదుర్కొంది. అర్ధరాత్రి వేళ ఆమెకు ఫోన్ చేసి ఆ వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడటంతో.. ఆమె ఫోన్​లో ఆ సంభాషణ రికార్డు చేసి.. పార్టీ అధినాయకత్వానికి పంపించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? అతనో అధికార పార్టీ ప్రజాప్రతినిధి. రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేసిన ఆయనకు మంచి రాజకీయ అనుభవం ఉంది. అంతటి గుర్తింపు ఉన్నా వంకరబుద్ధి మాత్రం ఎక్కడికి పోలేదు. ఆయన మాట్లాడినట్టు బయటికొచ్చిన ఆడియో రికార్డులు ప్రస్తుత రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన నియోజకవర్గంలో మహిళా కార్పొరేటర్​తో సమయం సందర్భం లేకుండా రాత్రివేళ ఫోన్​చేసి మాట్లాడిన సంభాషణలు పార్టీ అధినాయకత్వం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం మేరకు.. గత కొంతకాలంగా ఆ ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో మహిళా కార్పొరేటర్​తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఆమె భర్త కూడా రాజకీయాల్లో చురుగ్గానే ఉంటున్నాడు. తన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఆమెతో చనువుగా ఉండేవాడు. అతడి బుద్ధి తెలియక ఆమె కూడా తన ఇబ్బందులను అతనితో పంచుకునేది. దీన్నే అవకాశంగా తీసుకున్న ఆ ప్రజాప్రతినిధి ఒక అడుగు ముందుకు వేశాడు. సమయం రాగానే తన వంకర బుద్ది బయట పెట్టాడు. మూడు రోజుల క్రితం రాత్రివేళ ఆమెకు ఫోన్​ చేసి వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించాడు. మెల్లిగా తర్వాత తిన్నావా.. లేదా? ఈ రాత్రి వరకు ఏం తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది అంటూ గోముగా అడిగాడు.. కొంత సమయం తర్వాత అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో కంగుతిన్న ఆమె.. ముందు జాగ్రత్తగా తన ఫోన్​లో ఆ సంభాషణను రికార్డు చేసింది. ఈ సంభాషణల్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇంకా ఈ రికార్డుల్ని ఒక మంత్రికి కూడా పంపినట్టు తెలుస్తోంది. మంత్రి ఎదుట ఆ సంభాషణ గురించి తన గోడు చెప్పుకుంటూ ఆ మహిళా కార్పొరేటర్ కన్నీరు పెట్టుకున్నారని తెలిసింది. విషయం బయటకు పోనివ్వకుండా చూడాలని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అధినాయకత్వం ఆమెకు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై ఇంటలిజెన్స్​ బృందం వివరాలు సేకరిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement