Wednesday, October 9, 2024

Hyderabad – చంద్రబాబు అరెస్ట్ పై ఆందోళనలు ఆంధ్రాలో చేసుకోండి .. ఇక్కడ చేస్తే ఊరుకోబోం – కెటిఆర్

హైదరాబాద్‌: టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు పంచాయితీ ఆంధ్రాలోనే తేల్చుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ పంచాయితీలకు తెలంగాణను వేదిక కానివ్వబోమని స్పష్టం చేశారు. అక్క‌డ రాజ‌కీయ విభేదాల‌కు తెలంగాణ ప్రజలను తెదేపా, వైకాపా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.

”చంద్రబాబు అరెస్టు ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధం. మా పార్టీ నేతలు స్పందిస్తే అది వారి వ్యక్తగత వ్యవహారం. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపించే అంశం కాదు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ వివాదాలతో తెలంగాణకు సంబంధం లేదు. చంద్రబాబు అరెస్టు అయింది ఆంధ్రప్రదేశ్‌లో. ర్యాలీలు, ధర్నాలు చేయాలనుకుంటే అక్కడే చేయాలి. ఎవరూ అడ్డుకోరు. అక్కడ చేయకుండా ఇక్కడ రాజకీయ రాద్ధాంతం చేస్తానంటే ఎలా. తెలంగాణలో ఇవాళ ఒకరు ర్యాలీ చేస్తే.. రేపు మరొకరు చేస్తారు. పక్కింటి పంచాయితీ కూడా ఇక్కడ తేల్చుకుంటారా? విజయవాడలో, అమరావతిలో, రాజమహేంద్రవరంలో ర్యాలీలు చేయండి. ఒకరితో మరొకరు తలపడండి. ఏపీలో ఉన్న సమస్యపై హైదరాబాద్‌లో కొట్లాడతా అంటే ఎలా? ఇది సరైంది కాదు. ఇక్కడ మేం ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. శాంతిభద్రతల సమస్య వస్తే ఎలా? ఇలాంటి వాటికి ఇక్కడ ఎలా అనుమతిస్తాం. వాళ్ల ఘర్షణలకు హైదరాబాద్ వేదిక ఎలా అవుతుంది. ఆ రెండు పార్టీలకు తెలంగాణలో ఉనికి లేదు.. స్థానం లేదు. తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు కలిసిమెలసి ఉన్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో మేం తటస్థంగా ఉన్నాం. ఇలాంటివి చాలా సున్నితమైన అంశాలు. వాటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయాలి. ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉంది. ఈ సమయంలో రోడ్లపైకి వచ్చి ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడకూడదు. చంద్రబాబు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయనకు జరగాల్సిన న్యాయం కోర్టుల్లో జరుగుతుంది” అని కేటీఆర్‌ వివరించారు.

లోకేశ్‌.. పవన్‌.. జగన్‌.. నా మిత్రులే..

- Advertisement -

”లోకేశ్‌ .. జగన్‌.. పవన్‌ కల్యాణ్‌ నాకు మంచి స్నేహితులు. అందరూ దోస్తులే. ఆంధ్రాలో నాకు తగాదాలు లేవు. ఇప్పటికిప్పుడు యుద్ధాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే వారికి కూడా అలాంటి అవసరం లేదు. ప్రాంతాలతో సంబంధం లేకుండా హైదరాబాద్‌లో అందరూ కలిసి మెలసి ఉంటున్నాం. ఇక్కడ లేని పంచాయితీలు ఎందుకు పెట్టాలి. ఇక్కడున్న ఆంధ్రా ప్రజలు పదేళ్ల నుంచి సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి వాళ్లను ఇబ్బంది పెట్టడం సరికాదు. ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఓ మిత్రుడి ద్వారా లోకేశ్‌ ఫోన్‌ చేయించారు. ఒకరికి అనుమతిస్తే ఇంకొకరు ర్యాలీ చేస్తారు. అందుకే అనుమతించడం లేదని చెప్పా. ఐటీ కారిడార్‌లో తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఉద్యమాలు జరగలేదు. అప్పటి ప్రభుత్వాలు కూడా అనుమతి ఇవ్వలేదు. ఐటీ కార్యకలాపాలు దెబ్బతినొద్దు. ఏపీ నుంచి ఎంతో మంది ఇక్కడికొచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ల పెట్టుబడులు, భవిష్యత్తు బాగుండాలి. అలా ఉండాలంటే హైదరాబాద్‌లో శాంతి భద్రతలు అదుపులో ఉండాలి” అని కేటీఆర్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement