Sunday, February 25, 2024

మహావిష్ణువు తొలి మానవ అవతారం

శ్రీ మహావిష్ణువు అన్ని యుగాలలోనూ దుష్ట శిక్షణ… శిష్ట రక్షణకు అనేక అవతారాలు ఎత్తాడు. వాటి అన్నిటిలోనూ దశావతారాలు ప్రముఖమైనవి. ఈ దశావతారాల్లో అయిదవ అవతారం వామనావతారము. విష్ణుమూర్తి మొదటి మానవ అవతారం వామనుడు. భాద్రపద శుక్ల పక్షంలో శ్రవణా నక్షత్ర యుక్త ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు వామనుడుగా అదితి గర్భమున ఉద్భవించాడు. నేడు వామన జయంతి సందర్భంగా వామనావతారం విశిష్టతను మరొకసారి సదా స్మరించుకుని తరిద్దాం….

ప్రహ్లాదుని కుమారుడైన వైరోచనుని కుమారుడు, ప్రహ్లాదుని మనువడు అయిన బలి చక్రవర్తిని అంతం చేయడానికి శ్రీమహావిష్ణువు ఈ వామనావతారం ఎత్తాడు. బలి చక్రవర్తి విశ్వజిత్‌ అనే యాగము చేయటం ద్వారా, బ్రాహ్మణులకు దానాలు చేయడం ద్వారా అమిత శక్తిమంతుడై దేవేంద్రునిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు. దేవతలంతా చెల్లా చెదురైపోయారు. దేవతల తల్లి అయిన అదితి, తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్లి తన పుత్రుల దీనస్థితిని వివరించి బాధపడుతుంది. బలిచక్రవర్తియే ఇంద్రలోకంలోని భోగభాగ్యాలన్నిటినీ అనుభవిస్తూ దేవతలకు ఏ సౌకర్యాలు లేకుండా చేస్తున్నాడని మొర పెట్టుకుంది. అప్పుడు కశ్యపుడు భార్యతో నారాయణుడిని పూజించమని పయోభక్షణము అనే వ్రతాన్ని ఉపదేశిస్తాడు. ఆ వ్రత ఫలితంగా భాద్రపద శుద్ధ ద్వాదశిరోజు మధ్యాహ్నం వామన రూపంలో విష్ణువు అదితి గర్భంలో జన్మిస్తాడు. బలి చక్రవర్తిని అణచివేసే అవకాశం గురించి ఎదురుచూస్తూ వుంటాడు.

మూడు అడుగులు దానం అడిగిన వామనుడు

బలి చక్రవర్తి ఒకసారి అశ్వమేథ యాగాన్ని తలపెట్టాడని తెలుస్తుంది. బలిని అణగ దొక్కేందుకు ఇదే సరైన అదనుగా భావిస్తాడు విష్ణుమూర్తి. ఎవరైనా సరే తన దగ్గరకు వచ్చి ఏది అడిగినా లేదనకుండా దానమిచ్చే స్వభావి బలిచక్రవర్తి. అందులోనూ బ్రాహ్మణులు వచ్చి అడిగితే అడిగినవన్నీ ఇవ్వడం ఆయన బలహీనత. అది గ్రహించిన వామన రూపంలో జన్మించిన విష్ణుమూర్తి బలి చక్రవర్తి యజ్ఞశాలకు వెళ్తాడు. బలిచక్రవర్తి ఆ వామనునిని సాదరంగా ఆహ్వా నిస్తాడు. సకల మర్యాదలు చేస్తాడు. అర్ఘ్యపాద్యాదులను సమర్పించి, ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు వామనుడు తనకు యాగం చేసుకొనేందుకు మూడు అడుగుల నేల కావాలని కోరతాడు. అందుకు బలి చక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు. దానం కోరి వచ్చినవాడు వామన రూపంలో వున్న రాక్షస విరోధి అయిన శ్రీమహావిష్ణువు అని అక్కడ వున్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు గ్రహిస్తాడు.
వెనువెంటనే శుక్రాచార్యుడు బలిని పిలిచి వచ్చినవాడు విష్ణువు అని, అతనికి ఏ దానం చేయవద్దని, వెంటనే ఇక్కడ నుంచి పంపివేయమని సలహా ఇస్తాడు. అందుకు బలిచక్రవర్తి తానేమీ చేయలేనని, దానమిస్తానని చెప్పి, వెనువెంటనే ధన ప్రాణాలపై వ్యామోహంతో ఆ దానం చేయనని పలకలేనని అంటాడు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఇచ్చిన మాటమీద నిలబడి ఉంటా నని, మాటను వెనుకకు తీసుకోలేనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. అందుకు ఆగ్రహించిన శుక్రాచార్యుడు తన మాట వినకపోతే శీఘ్రకాలం లోనే రాజ్యభ్రష్టుడవు అవుతావని చెప్పి వెళ్ళిపోతాడు.
అనంతరం బలిచక్రవర్తి వామనుని పాదాలు కడిగి, ఆ నీరును తలమీద చల్లుకుంటాడు. వామనుడు కోరిక మేరకు మూడు అడుగులు దానమిస్తు న్నానని ప్రకటిస్తూ కలశంతో తన చేతి మీదుగా వామనుని చేతిలో నీళ్ళు పోస్తుంటాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడతాడు. ఇది గ్రహించిన వామనుడు అక్కడున్న దర్భ పుల్లతో రంధ్రాన్ని పొడవగా శుక్రాచార్యుడు తన రెండు కళ్ళల్లో ఒక కన్నును కోల్పోతాడు. దానం స్వీకరించిన వామనుడు కొద్దికొద్దిగా పెరుగుతూ యావత్‌ బ్రహ్మాండమంతా ఆక్రమించేస్తాడు. ఒక పాదము (అడుగు) భూమి మీద వేసి, రెండవ పాదము (అడుగు) ఆకాశమ్మీద వేసి, మూడవ పాదం ఎక్కడ వెయ్యాలని బలిచక్రవర్తిని అడుగుతాడు. అప్పుడు బలి ఇక నాదగ్గరు ఇచ్చేందుకు ఏమీ లేదు. మీ మూడవ అడుగు నా నెత్తి మీద వెయ్యి పురుషోత్తమా అంటాడు. వామనుడు తన మూడో పాదాన్ని బలి నెత్తి మీద వేసి అథ:పాతాళానికి తొక్కేస్తాడు. అయితే బలి దాన గుణానికి సంతోష పడిన శ్రీ మహా విష్ణువు ప్రతి సంవత్సరం అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేట్టు వరమిస్తాడు. ఇప్పటికీ కేరళలో ఓనం పండుగను బలి రాక కోసం అత్యంత వైభవంగా నిర్వ హిస్తారు. వామన జయంతినాడు వైష్ణవ ఆలయాలకు వెళ్ళి శ్రీమహావిష్ణువును పూజిస్తే శుభప్రదం. మంగళకరం. జయప్రదం.
మూడు అడుగులతో ఈ లోకాన్ని జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడు అని పేరు. ఆ త్రివిక్రముని పేరు మీద చాలా ఆలయాలు వున్నాయి. కంచిలో ఉన్న ఉళగలంద పెరు మాళ్‌ ఆలయం, ఖజరుహోలో వున్న వామన ఆలయం వీటిలో ప్రముఖమైనవి. ఇవే కాకుండా ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, కేరళ తదితర చోట్ల కూడా వామనుడి ఆలయాలు అనేకం ఉన్నాయి.

వామనుడి కోరికలోని ఆంతర్యం

బలిచక్రవర్తిని వామనుడు మూడు అడుగులు భూమి కావాలని కోరడంలోని ఆంతర్యాన్ని నేటి తరానికి అన్వయించి చూస్తే… వామనుడు కోరిన మూడు అడుగులు సత్వరజోతమో గుణాలనీ, అవి సృష్టి స్థితి లయలను సూచిస్తాయని అంటారు. ఇక బలి తల మీద పాదం మోప డం అంటే అహంకారాన్ని అణచివేయడమే. తనంత గొప్పవారు లేరనే దురహం కారంతో ఇంద్రలోకాన్ని ఆక్రమించి అందరికీ ఇబ్బందులు కలిగించిన బలిచక్రవర్తి ని అణచివే తలోని ఆంతర్యం దురహంకారంతో విర్రవీగే వారికి ఎన్నటికైనా అథోగతి తప్పదని తెలియజేశాడు శ్రీ మహావిష్ణువు.
వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువును కొలిచినవారు కూడా తమలో వున్న ఎటువంటి అహంకారాన్ని అయినా జయిస్తారు. ఈతిబాధల నుంచి విముక్తి పొందుతారని మన ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. పెద్దల విశ్వాసం కూడా.

Advertisement

తాజా వార్తలు

Advertisement