Friday, April 26, 2024

ఎరువుల‌పై అధిక ధ‌ర‌ల‌ను అరిక‌ట్టాలి

రైతులు పండించే పంట అధిక దిగుబడి రావాలంటే ఎరువులు వాడక తప్పదు. అలాంటి ఎరువుల ధరలు రోజురోజుకు బరువై పోతున్నాయి. ఎరువుల ధరలు పెరగడంతో రైతులపై అధిక భారం పడి అప్పుల ఊబిలో కూరుకుపోయి కుదేలవుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఫెర్టిలైజర్ వ్యాపారులు అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని వాజేడులో.. యూరియా డిఎపి 20 20, 28 28 ఇలా అనేక రకాల ఎరువు బస్తాల పై అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క ఎరువు బస్తాకు అదనంగా 300 రూపాయలు వసూలు చేస్తూ ఉండడంతో రైతులకు పెట్టుబడులు పెరిగిపోయి అప్పుల పాలు కాక తప్పడంలేదు. ఓవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువుల ధరలను మరింతగా పెంచడం, మరోవైపు ప్రైవేటు వ్యాపారులు అదనంగా వసూలు చేయడంతో రైతుపై ఎరువుల భారం అధికంగా పడి అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు.

ఎకరం మిర్చి వ్యవసాయానికి రూ.70వేల నుండి రూ.80 వేల మేరకు పెట్టుబడి పెట్టే రైతు నేడు లక్ష నుండి లక్షా 50 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. సబ్సిడీ ఎరువులు ప్రభుత్వ సెక్టార్ లో లభించడంతో రైతులకు కొంతమేర భారం తగ్గేది. అలాంటిది ఈ ఏడాది ప్రభుత్వ సెక్టార్ లో ఎరువులు సకాలంలో అందించకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలకు ఎరువులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ సెక్టార్ లో ఎరువులు నిల్ ఉంటే ప్రవేట్ వ్యాపారుల వద్ద ఫుల్లుగా దొరుకుతున్నాయి. స్థానిక అధికారులు మాత్రం ప్రభుత్వ సెక్టార్లో ఇండెంట్ పెట్టినా సకాలంలో ఎరువులు రావడంలేదని అంటున్నారు.

దీంతో ప్రవేటు వ్యాపారులకు అనుకూలంగా మారి ఎరువుల వ్యాపారులు రైతులను అందినకాడికి దోచుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఫెర్టిలైజర్ వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ధరల పట్టికలో ఏర్పాటు చేయకుండా ధరల పట్టికలో ఎరువుల వివరాలు, ఎరువుల ధర ముద్రించకుండా కొన్ని ఫెర్టిలైజర్ షాపుల్లో బిల్లులు కూడా చెల్లించకుండా బయోమెట్రిక్ విధానాన్ని పక్కనపెట్టి ఎరువులు విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ప్రజాప్రతినిధుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో ఫెర్టిలైజర్ వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి అధిక ధరలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement