Tuesday, April 30, 2024

ఫస్ట్ డోస్ లేదు… రెండో డోస్ ఇస్తాం : డీహెచ్ శ్రీనివాసరావు

తెలంగాణలో ఇంకా 15 లక్షల మందికి మే 31 లోపు వారికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు తెలిపారు. ప్రజలు ఆన్‌ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కోవిషీల్డ్ రెండో డోసును 6 నుంచి 8 వారాల మధ్యలో తీసుకోవాలని, కోవ్యాగ్జిన్ 4 నుంచి 6 వారాల మధ్యలో తీసుకోవాలని సూచించారు. మిగతా వారికి దశల వారీగా టీకాను అందిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పడకల కొరత లేదని డీహెచ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం 5,783 ఆక్సిజన్‌ పడకలు, 17,267 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలకు ఎలాంటి కొరత లేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్‌ను సక్రమంగా వినియోగించాలని సూచించారు. రెమ్‌డెసివిర్ వంటి ఔషధాలు వైద్యుల సలహా మేరకే వాడాలని తెలిపారు. రెమ్‌డెసివిర్‌కు ప్రత్యామ్నాయ ఔషధాలూ ఉన్నాయని వివరించారు. గతేడాది సెప్టెంబర్ నాటికి 236 ఆస్పత్రులు కోవిడ్ సేవలకు అందుబాటులో ఉంటే, వాటిని 1200 కు పైగా పెంచుకున్నామని చెప్పారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. పాజిటివిటి రేటుతో పాటు మరణాల సంఖ్య రాష్ట్రంలో క్రమంగా తగ్గుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement