Tuesday, May 7, 2024

బిజెపికి ఓటేస్తే ధ‌ర‌లు మ‌రింత పెరుగుతాయి – హ‌రీష్ రావు….

సిద్ధిపేట : నిత్యావసరాలు, పెట్రో, వంట గ్యాస్‌ ధరలు భారీగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న బీజేపీకి ఓటెందు వేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ, బిజెపి ఎప్పుడు, ఎక్క‌డ గెలిచినా ధ‌ర‌లు మ‌రింతగా పెరుగుతాయ‌ని అన్నారు. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను అమ్మ‌డం, కార్పొరేట్ల‌కు దోచి పెట్ట‌డ‌మే బిజెపి విధాన‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు.. రైతుల నుంచి సామాన్యుల వ‌ర‌కూ బిజెపి పాల‌న‌లో అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నార‌ని గుర్తు చేవారు.. నల్గొండ – ఖమ్మం- వరంగల్ జిల్లా పట్టబధ్రుల నియోజవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వ అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నదని యువతకు వీటిని వివరించి ఓటు అభ్యర్థించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీజేపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని.. చేతనైతే ఢిల్లీలో మాట్లాడాలని అన్నారు. ఇంటింటికీ తాగునీరు, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మిలాంటి పేదలకు ఉపయుక్తమైన పథకాలు ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయో ఆ పార్టీ నాయకులు చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. 14.2 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే నంబర్ వ‌న్ గా ఉంద‌ని. అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం కూడా మనదేనని అన్నారు. మన పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నద‌ని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement