Friday, May 3, 2024

బార్డ‌ర్ లో గుట్కా దంధా.. ప‌క్క రాష్ట్రం నుంచి అక్ర‌మ‌రవాణ‌.. ప‌ట్టించుకోని అధికారులు..

(ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి ) : కర్ణాటక రాష్ట్రంలో గుట్కాపై నిషేధం లేదు. అక్క‌డి అన్ని ప్రాంతాల్లో గుట్కా తయారు చేస్తున్నారు. మన రాష్ట్రంలో గుట్కా తయారీపై నిషేధం ఉంది. ఎవరైనా తయారు చేసినా… విక్రయాలు చేసినా కఠిన చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉండటంతో బైకులపై గుట్కా తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. కొత్లాపూర్‌ వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఇది పేరుకే చెక్‌పోస్టు. ఇక్కడ నిరంతరం తనిఖీలు లేకపోవడంతో గుట్కా రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. చెక్‌పోస్టు వద్ద క్రమం తప్పకుండా తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ పండగల సమయంలోనే ఇక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. మిగతా సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో నిరంతరం కర్ణాటక నుండి గుట్కా రవాణా జరుగుతోంది. చెక్‌పోస్టు వద్ద నిరంతరం తనిఖీలు చేస్తే వచ్చిపోయే వాళ్లు భయపడతారు. కానీ పెద్దగా తనిఖీలు లేకపోవడంతో ఇబ్బంది లేకుండా పోయింది. కర్ణాటక బార్డర్‌ కు గ్రామాలకు మధ్య కొద్ది దూరం మాత్రమే ఉండటంతో వారికి ఇబ్బంది లేకుండాపోయింది. ఎవరికీ అనుమానం రాకుండా బైకులపై గుట్కా తెచ్చుకుంటున్నారు. కొద్ది సేపట్లో గుట్కా కొనుగోలు చేసి తీసుకవచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.

మూడు మండలాలకు దగ్గర్లో కర్ణాటక శివార్లు..

వికారాబాద్‌ జిల్లా పరిధిలోని తాండూరు, బషీరాబాద్‌, పెద్దెముల్‌ మండలాల పరిధిలోని గ్రామాలు కర్ణాటక బార్డర్‌కు అత్యంత సమీపంలో ఉన్నాయి. ఆ ప్రాంతాల మీదుగా కూడా గుట్కా వ్యాపారం కొనసాగుతోంది. గ్రామాల మీదుగా కర్ణాటక బార్డర్‌పరిధిలో ఉన్న గ్రామాలకు వెళ్లి గుట్కా కొనుగోలు చేస్తున్నారు. కొందరు కర్ణాటక గుట్కా వ్యాపారులు నేరుగా మన బార్డర్‌ దాటి గ్రామాలకు వచ్చి గుట్కా రవాణా చేస్తున్నారు. గ్రామాల మీదుగా వస్తే ఎలాంటి అనుమానం వచ్చే అవకాశం లేదు. అందుకే మూడు మండలాల పరిధిలోని కర్ణాటక శివారు గ్రామాల నుండి చేర్చాల్సిన ప్రాంతాలకు గుట్కా చేర్చుతున్నారు. బార్డర్ల వద్ద గట్టి నిఘా పెడితే అటువైపు వెళ్లేందుకు భయపడతారు. కానీ కొత్లాపూర్‌ చెక్‌పోస్టు వద్ద ఎలాంటి తనిఖీలు లేకపోవడంతో గుట్కా వ్యాపారులకు కలిసి వస్తోంది.

పోలీసులు నిఘా పెడితేనే..

గుట్కా అక్రమ రవాణాకు బ్రేకులు పడాలంటే పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా తనిఖీలు చేసి గుట్కా విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. గతంలో బహిరంగంగా గుట్కా అమ్మకాలు జరిపారు. గత కొన్ని సంవత్సరాలుగా అమ్మకాలపై నిషేధం నెలకొనడంతో రహస్యంగా అమ్మకాలు చేస్తున్నారు. మారుమూల పల్లెల్లో కూడా గుట్కా అమ్మకాలు జరుగుతున్నాయంటే గుట్కా వ్యాపారుల నెట్‌వర్క్‌ ఎంతమేర ఉందో తెలిసిపోతుంది. అప్పుడప్పుడు తప్పిస్తే పెద్దగా గుట్కా అమ్మకాలపై పోలీసులు దృష్టిని కేంద్రీకరించడం లేదు. చిన్న పాటి క్లూ ద్వారాపెద్దపెద్ద కేసులు డీల్‌ చేసే పోలీసులు గుట్కా నెట్‌వర్క్‌ ను ఎందుకు ఛేదించడం లేదనేది ఆలోచించాల్సిన విషయం. గుట్కాతో క్యాన్సర్‌ భారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిండు నూరేళ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొంతమంది గుట్కా భారినపడకుండా పోలీసులు నిఘా వ్యవస్థను పటిష్టం చేసి వ్యాపారానికి బ్రేక్‌లు వేస్తేనే ప్రయోజనం చేకూరుతుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement