Sunday, April 28, 2024

గృహలక్ష్మీ పథకం నిరంతర ప్రక్రియ.. మంత్రి గంగుల కమలాకర్

క‌రీంన‌గ‌ర్ : గృహలక్ష్మీ పథకం నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గృహలక్ష్మీ… దళితబంధు… బీసీ కులవృత్తులకు చేయూత… సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాల పై కరీంనగర్ కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై… తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల అమలు, అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇప్పటికే నిరుపేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్న కేసీఆర్ సర్కారు… సొంత జాగ ఉండి… ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి గృహలక్ష్మీ పథకం కింద 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

పథకాల అమలును యుద్దప్రతిపాదికన చేపట్టి లబ్దిదారులకు అందించాలని సూచించారు. ఇందుకోసం తీసుకోవల్సిన చర్యల పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాన్ని అమలు చేస్తామన్నారు. దరఖాస్తు కూడా సులభతరంగానే ఉంటుందన్న మంత్రి గంగుల… స్లాబ్ ఇల్లు ఉన్నవారు…. జీఓ 59కింద లబ్దిపొందిన వారు ఈ పథకానికి అనర్హులన్నారు. గృహలక్ష్మీ కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారమ్ అంటూ ఏది లేదని.. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫారమ్ తో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. మీరు తెల్లకాగితంపై రాత పూర్వకంగా దరఖాస్తు రాసి… ఆహార భద్రత కార్డు… అధార్ కార్డు… ఓటర్ ఐడికార్డుతో కలిపి… మీ తహసీల్దార్ కు అందిస్తే… వారు కలెక్టర్ కు అందిస్తారని చెప్పారు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చుని తెలిపారు.

- Advertisement -

లబ్దిదారుల ఎంపికను జిల్లా మంత్రి… కలెక్టర్ రూపొందిస్తారన్నారు. పట్టణ ప్రాంతాలకు చెందిన దరఖాస్తు దారులు… మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గృహలక్ష్మీ పథకం అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక నోడల్ ఆఫీసర్… ప్రతి మండలానికి ఒక స్పెషల్ వెరిఫికేషన్ అధికారిని నియమించామని చెప్పారు. 3 లక్షల రూపాయలను మూడు విడతలుగా అందిస్తామని, అందులో బెస్ మెంట్ పూర్తికాగానే మొదటి విడతగా లక్ష రూపాయలు… రూఫ్ పూర్తి కాగానే 2వ విడతగా మరో లక్ష రూపాయలు… నిర్మాణం పూర్తయిన తర్వాత 3వ విడతలో చివరి లక్ష రూపాయలు అందిస్తామన్నారు. గృహలక్ష్మీ లబ్దిదారులు ఇలాగే ఇల్లు నిర్మించుకోవాలని ప్రభుత్వం ఎలాంటి నిబంధన పెట్టలేదని… ఎవరికి నచ్చిన విధంగా వారు ఇల్లు నిర్మించుకోవచ్చాన్నారు. గృహలక్ష్మీ పథకం కింద ఈ నెల 10వ తేదీవరకు దరఖాస్తులు స్వీకరించి… 20వ తేదీలోగా లబ్దిదారుల వెరిఫికేషన్ పూర్తిచేస్తామన్నారు. 25వ తేదీన మొదటి విడత లబ్దిదారులకు అందిస్తామని చెప్పారు. లబ్దిదారుల్లో ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 10 శాతం, బీసీలు 50 శాతం… వికలాంగులు 5 శాతం మించకుండా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. గృహలక్ష్మీ పథకం… మహిళ పేరుతో అందజేయడం జరుగుతుందని… స్థలం మహిళ పేరుతో ఉండాల్సిన అవసరం లేదన్నారు. పథకం కోసం మహిళ పేరిట నూతన బ్యాంకు అకౌంట్ తీయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గృహలక్ష్మి పథకం కింద మొదటి విడతగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 10 వేల 5 వందలు మంజూరు అయ్యాయని..ఇందులో కరీంనగర్ నియోజకవర్గానికి 3 వేల మందికి, చొప్పదండి నియోజకవర్గానికి 1650 మంది, మనకొండుర్ నియోజకవర్గానికి 2వేల మంది, హుజూరాబాద్ కు 2600 మంది, హుస్నాబాద్ నియోజకవర్గంలోని కరీంనగర్ జిల్లా పరిధిలో మండలాలకు 1250 మంది లబ్ధిదారులకు అందించనున్నామని తెలిపారు.

మొదటి విడుతలో పెండింగ్ లో ఉన్న యూనిట్లను పూర్తిస్థాయి గ్రౌండింగ్ చేసేందుకు అధికారులు యుద్దప్రతిపాదికన చర్యలు తీసుకోవాలన్నారు. గొర్రెల పథకం మొదటి విడతలో మంజూరైన వారికి యూనిట్లు త్వరగా అందించాలని సూచించారు.. 2వ విడతగా జిల్లాకు 10 వేల 236 యూనిట్లను కేటాయించారని… దీనికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కరీంనగర్ జిల్లాకు 540 మంది వీఆర్ఏలను కేటాయించారని… వీరిని ఆయా శాఖాల్లో నియమిస్తూ రేపటి నుండి ఆర్డర్లు జారీ చేస్తామన్నారు. విఆర్ఏల్లో 60 ఏళ్ళ లోపు 439 మంది ఉంటే… 60 ఏళ్ళు దాటిన వారు 107 మంది ఉన్నారని… 61 ఏళ్ళు ఉన్న వారి కుటుంబ సభ్యుల విద్యార్హతను బట్టి… ఉద్యోగ నియమాకాలు చేపడుతామన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, ప్రణాళిక సంఘం ఉపాద్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మానకొండూర్ చొప్పదండి, హుస్నాబాద్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ సుంకె రవిశంకర్, సంతోష్ కుమార్ లు, జిల్లా కలెక్టర్ డా. బి. గోపి, అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్, డిసిసి చైర్మన్ కొడూరి రవీందర్, సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణా రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనీల్ గౌడ్, వ్యవసాయ మార్కెటింగ్ కమిటి చైర్మన్ రెడ్డవేణి మదు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement