Sunday, May 19, 2024

పెరుగుతున్న డిమాండ్‌.. గ్రేటర్ హైదరాబాద్​లో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ : నగరంలో 132 కేవీ, నగర శివార్లలో 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం అవశ్యకతను గుర్తించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే భౌరంపేట లో 220 కేవీ సబ్‌స్టేషన్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. సీతారాం బాగ్‌లో 132 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేపట్టడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. దీనికి అసిఫ్‌నగర్‌ నుంచి సీతారాంబాగ్‌ వరకు భూగర్భ కేబులు వేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

ముందు చూపుతో :

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు హైదరాబాద్‌ మహానగరంలో సైతం విద్యుత్‌ సమస్యలకు కొదవలేదు. విద్యుత్‌ ఉన్నా మౌలిక సదుపాయాలు (సబ్‌స్టేషన్లు, ఫీడర్లు) సరిగా లేకపోవ డంతో విద్యుత్‌ సరఫరాకు అనేక అడ్డంకులు వచ్చేవి. ఒక్కొక్క సబ్‌స్టేషన్‌పై పూర్తిస్థాయిలోడ్‌ వచ్చినా అదనపు సబ్‌స్టేషన్ల నిర్మాణంపై దృష్టి సారించే వారు కాదు. సబ్‌స్టేషన్‌పై లోడ్‌ పెరగడంతో కొన్ని ఫీడర్లకు విద్యుత్‌ సరఫరాను నిలిపి వేసి ఉన్న దాంతోనే సర్దుబాలు చేసేవారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్య మంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో ముందుగా విద్యుత్‌శాఖపై దృష్టి సారించారు. అందుకు ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ జి. రఘుమారెడ్డిలతో చర్చలు జరిపి ఎంత ఖర్చయినా పర్వాలేదు, తెలంగాణలో విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. దీంతో సీఎండీలు అధికారులతో చర్చించి నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ అందించాలంటే ముందు సబ్‌స్టేషన్లను, ఫీడర్లను బలోపేతం చేయాలని, అవసరమైన చోట సబ్‌స్టేషన్లను నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కేవలం హైదరాబాద్‌ నగరంలోనే వందకు పైగా 33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం జరిగిందంటే అతిశయోక్తి కాదు. అలాగే 132కేవీ, 220 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణంతో పాటు 400 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం చేశారు. ప్రతి సబ్‌స్టేషన్‌కు హైదరాబాద్‌ నగరం చుట్టురా రెండు ఫీడర్ల ద్వారా విద్యుత్‌ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. మరో దశాబ్ధ కాలం వరకు అవసరమయ్యేంత మౌలిక వసతుల నిర్మాణం చేపట్టారు. అయినా ఇప్పటికీ అవసరమైన చోట సబ్‌స్టేషన్ల నిర్మాణంపై దృష్టి సారిస్తూనే ఉన్నారు.

లోడ్‌ 70 శాతానికి చేరితే :

వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేయడానికి అవసరమైన వసతుల కల్పనకు 33 కేవీ సబ్‌స్టేషన్లను, ఫీడర్లను ఎస్‌పీడీసీఎల్‌ (డిస్కమ్‌) నిర్మిస్తుంది. వీటికి విద్యుత్‌ను అందించ డానికి ట్రాన్స్‌కో 132కేవీ, 220 కేవీ, 400 కేవీ సబ్‌స్టేషన్లను ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్‌ను స్టెప్‌డౌన్‌ చేస్తూ ట్రాన్స్‌కో సరఫరా చేస్తుంది. అయితే డిస్కం పరిధి అయి నా సరే, ట్రాన్స్‌కో పరిధిలో ఉన్న సబ్‌స్టేషన్లలో లోడ్‌ 70శాతానికి చేరు కుంటే తక్షణమే మరో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణంపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే అసిఫ్‌నగర్‌ సబ్‌స్టేషన్‌పై లోడ్‌ 70శాతం దాటిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా మరో 132 కేవీ సబ్‌స్టేషన్‌ను సీతారాంబాగ్‌లో ఏర్పాటుకు సన్నద్దం అవుతున్నారు. సుమారు రూ. 60నుం చి రూ. 70కోట్లతో సీతారాం బాగ్‌ సబ్‌స్టే షన్‌ను నిర్మించనున్నారు. ఇందుకు గానూ అసిఫ్‌నగర్‌ నుంచి సీతారాం బాగ్‌ వరకు మెహిదీపట్టణం మీదుగా నాలుగున్నర కిలోమీటర్ల దూరం భూగర్భ కేబులు ఏర్పాటు చేయడానికి సర్వే పూర్తి చేశారు.

- Advertisement -

భౌరంపేటలో :

హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన భౌరంపేటలో 220 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణం పనులు సాగుతున్నాయి. ఈ సబ్‌స్టేషన్‌కు నర్సాపూర్‌ నుంచి గండి మైసమ్మ మీదుగా విద్యుత్‌ లైన్‌ వేస్తున్నారు. నర్సాపూర్‌ నుంచి భౌరంపేట వరకు 35 కిలోమీటర్ల దూరం ఉండ టం వల్ల ఇంత దూరం భూగర్భ కేబులు వేస్తే ఖర్చు పెరుగుతుందని భావించిన అధికారులు మూడు విధాలుగా కేబుల్‌ వేస్తున్నారు. నర్సాఫూర్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు 25 కిలోమీటర్ల దూ రం హైటెన్షన్‌ టవర్ల ద్వారా ఓవర్‌ హెడ్‌ లైన్లు వేస్తున్నారు. ఓఆర్‌ఆర్‌ నుంచి భౌరంపేట వరకు 5 కిలోమీటర్ల దూరం మోనోఫోల్స్‌ వేస్తున్నారు. భౌరంపేట గ్రామం లోపల నుంచి సబ్‌స్టేషన్‌ వరకు మరో 5 కిలోమీటర్ల దూరం భూగర్భ కేబుల్‌ వేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement