Friday, April 26, 2024

టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ : 25శాతం తగ్గింపు

తెలంగాణ ఆర్టీసీ ఇటీవ‌లే టోల్ ఛార్జీలు, సేఫ్టీ సెస్ పేరుతో ఛార్జీలు పెంచేసిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌యాణీల‌కు కొంత ఊర‌ట‌నిచ్చే నిర్ణ‌యం ఒక‌టి తీసుకుంది టీఎస్ ఆర్టీసీ. ప్రత్యేక బస్సుల్లో అదనపు బాదుడును సగానికి సగం తగ్గించింది. సెలవులు, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిపే బస్సుల్లో ఆర్టీసీ ఇప్పటివరకు 50శాతం అదనంగా ఛార్జీలు వసూలు చేస్తూ వస్తోంది. ఇకపై దాన్ని 25శాతమే వసూలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. పండగలు, జాతరలు, వీకెండ్‌లో ఏర్పాటు చేసే ప్రత్యేక బస్సుల్లో ఎప్పటినుంచో అదనంగా 50 శాతం అంటే 150 శాతం ఛార్జీ వసూలు చేస్తున్నారు. దీంతో ఆ సమయాల్లో ప్రయాణం చేసేవారికి భారమవుతోంది. దీనికి తోడు ఇటీవల డీజిల్‌ ధరలు పెరగడంతో పల్లెవెలుగు బస్సుల్లో రూ.5, మిగిలిన అన్ని బస్సుల్లో రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో పాటు సేఫ్టీ సెస్‌, బస్టాండుల్లో సౌకర్యాల కల్పన, టోల్‌ఛార్జీల వ్యత్యాసం, టికెట్టు ధరను సమీప రూపాయికి సవరించడం… వంటి చర్యల పేరుతో ఆర్టీసీ ప్రయాణికులపై మోయలేని భారాన్ని మోపింది. ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్న ఫైల్ ఆమోదం పొందితే ఛార్జీలు కనీసం 30శాతం వరకూ పెరిగే అవకాశముంది. దీంతో ప్రజలు ఆర్టీసీ బస్సులకు దూరమయ్యే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బస్సుల్లో అధనంగా వసూలు చేసే ఛార్జీని 25శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement