Wednesday, May 22, 2024

ఆ గ్రామాలకు మహర్దశ.. తొలగిపోతున్న జీవో 111 అడ్డంకులు

ఉమ్మడిరంగారెడ్డి, (ప్రభన్యూస్‌) : ఒకటికాదు రెండు కాదు ఏకంగా ఇరవైఆరేళ్ల నిరీక్షణ ఫలిస్తోంది… ఏ కారణంతో జీవో జారీ చేశారో కానీ 84 గ్రామాల ప్రజలు పడ్డ కష్టాలు అంతా ఇంతకావు… అత్యవసరం కోసం భూములు అమ్మాలన్నా నిబంధనలు అడ్డొచ్చేవి, అమ్మకానికి పెట్టినా.. 111జీవో పరిధిలో ఉన్నందునా అంతంత మాత్రంగానే ధర వచ్చేది. పెళ్లిల సమయంలో తక్కువ ధరలకు భూములు అమ్ముకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ఐనా ఓపిక సహనంతో ఎదురు చూస్తూనే ఉన్నారు. జీవో పరిధిలో ఉన్న ఆంక్షలు ఒకొక్కటిగా ఎత్తివేస్తుండటంతో ఆ గ్రామాలకు మహర్దశ పట్టుకుంది. కంటికి రెప్పలా కాపాడుకున్న భూములు ఇప్పుడు కాసుల వర్షం కురుపించబోతున్నాయి. ఇరవైఆరేళ్ల ఎదురుచూపులకు న్యాయం జరుగుతోంది, ఇప్పటికే ప్రభుత్వం 111జీవో ఎత్తివేసింది… ఆప్రాంతాల్లో ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తూ జీవో 69 జారీ చేసింది… సీఎస్‌ సోమేష్‌కుమార్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించబోతున్నారు.. రిపోర్టు వచ్చేంతవరకు కాస్త ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్‌ మహానగరానికి కూతపెట్టుదూరంలో ఉన్న జంట జలాశయాల చుట్టూరా ఉన్న 84 గ్రామాలకు శాపంగా మారిన జీవో 111 ఎత్తివేయడంతో ఎవరినోట విన్నా ఆ ప్రాంతాల గురించే చర్చ సాగుతోంది. అప్పట్లో తక్కువ ధర ఉన్నప్పుడు కొనుగోలు చేస్తే బాగుండేది అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో భూములు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. 1996 సంవత్సరంలో జంట జలాశయాల చుట్టూరాఉన్న 84 గ్రామాల పరిధిలో జీవో ఏర్పాటు చేశారు. జలాశయాలు కలుషితం కాకుండా జీవోకు శ్రీకారం చుట్టారు. ఇప్పట్లో తెదేపాలో సంక్షోభం ఏర్పడటం… మాజీ మంత్రి ఇంద్రారెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు జీవోకు శ్రీకారం చుట్టారనే ప్రచారం కూడా ఉంది. కారణం ఏదైనా ఆ ప్రాంత ప్రజలు ఏపాపం చేశారో కానీ ఇరవైఆరేళ్లుగా నరకాన్ని అనుభవించారు. చాలామంది అవసరాలనిమిత్తం తక్కువ ధరలకు భూములు కూడా అమ్ముకున్నారు. పెళ్లిdలతోపాటు ఇతర అవసరాలకు చాలామంది భూములు అమ్ముకున్నారు. చాలామంది రైతులు భూములు అలాగే ఉంచుకున్నారు. కొంతమేర అమ్ముకున్నా ఇంకా భూములను అలాగే పెట్టుకున్నారు. జీవో ఎత్తివేయకపోతారా భూముల ధరలు పెరక్కపోతాయా అనే నమ్మకంతో చాలామంది రైతులు భూములను అమ్ముకోలేదు. వారి ఆశలు వమ్ము కాలేదు. నిరీక్షణ ఫలించింది. సీఎం కేసీఆర్‌ జీవో 111 ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 84 గ్రామాల పరిధిలో ఉన్న నిబంధనలను ఎత్తివేస్తూ 69జీవో విడుదల చేశారు. దీంతో ఆ ప్రాంత ప్రజల ఆనందానికి అవదులు లేకుండాపోయాయి. భూముల ధరల పెంపును మేమైనా చూస్తామా అని పిల్లలు మనో వేదనకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద 111 జీవో ఎత్తివేత మెజార్టీ ప్రజలకు న్యాయం జరిగింది.

అప్పుడే భూముల ధరలకు రెక్కలు..

గత నెలరోజుల వ్యవధిలో జీవో 111పై ఉన్న ఆంక్షలు ఒకొక్కటిగా తొలగిపోతుండటంతో ఆప్రాంతాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అసెంబ్లి సాక్షిగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. జీవో ఎత్తివేస్తామని హామిఇచ్చారు. అందులో భాగంగానే మంత్రివర్గ సమావేశంలో జీవోను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జీవో పరిధిలో ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ జీవో 69ని జారీ చేశారు. ఇలా ఒకొక్కటిగా అడ్డంకులు తొలగిపోతుండటంతో 84 గ్రామాల పరిధిలో ఉన్న భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అగ్నిమెంట్లు చేసుకున్న వాళ్లు వెంటనే రిజిస్ట్రేషన్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆంక్షలు తొలగిపోతుండటంతో ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నందునా చాలామంది భూములు అమ్మేందుకు ససేమిరా అంటున్నారు.

అందరిచూపు ఈ గ్రామాల వైపే..

- Advertisement -

జీవో 111 పరిధిలో ఉన్న ఆంక్షలు తొలగిపోవడంతో అందరిచూపు 84 గ్రామాల వైపు మళ్లింది. ఎలాగైనా ఆ ప్రాంతాల పరిధిలో భూములు, ప్లాట్లు కొనుగోలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. గతంలో జీవో పరిధిలో కొనుగోలు చేసేందుకు వెనకాముందు అయ్యారు. కొందరు ధైర్యం చేసి భూములు, ప్లాట్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం వాటి ధరలు కొండెక్కడంతో వారి ఆనందానికి అవదులు లేకుండాపోయాయి. కొనుగోలు చేయని వారిలో మాత్రం నిరాశ నెలకొంది. ధరలు తక్కువగా ఉన్న సమయంలో భూములు, ప్లాట్లు కొనుగోలు చేయాల్సింది అని అనుకుంటున్నారు. గతంలో ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం ధరలు పెరిగిపోయాయి. భూముల కోసం చాలామంది రియల్‌ వ్యాపారులు తిరిగే పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుత ధరలు రెట్టింపయ్యాయి. పాత ధరలకు భూములు కొనుగోలు చేయాలని రియల్‌ వ్యాపారులు భావిస్తుండగా ససేమిరా అంటున్నారు 84 గ్రామాల పరిధిలోని రైతులు. ఇప్పట్లో భూములు అమ్మకూడదని మెజార్టీ రైతులు నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. మొత్తం మీద హైదరాబాద్‌కు చెందిన రియల్‌ వ్యాపారులు 84 గ్రామాలపై దృష్టిని కేంద్రీకరించారు. ఎలాగైనా భూములు కొనుగోలు చేయాలనే పట్టుదలతో గ్రామాల్లో చక్కర్లు కొడుతున్నారు. మరికొంతకాలం ఆగితే భూముల ధరలు మరింతగా పెరిగే అవకాశాలుండటంతో చాలామంది రైతులు వెయిట్‌ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు.

కమిటీ రిపోర్టుపైనే భారం..

జీవో 111 పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి ఎలా చేయాలనే దానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా 84 గ్రామాలకు సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పలు సూచనలు కూడా చేసింది. జంట జలాశయాలు కలుషితం కాకుండా ప్రత్యేక పైప్‌లైన్‌ ఏర్పాటు చేయడం….గ్రామాల పరిధిలో ఎస్‌టీపీలు ఏర్పాటు చేయడం వంటి వాటిని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రెండురోజుల క్రితం కమిటీ తొలి సమావేశం కూడా జరిగింది. మొత్తం మీద 84 గ్రామాల అభివృద్ధిని దృష్టిలోపెట్టుకుని ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించే దిశగా అడుగులు వస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement