Monday, May 13, 2024

కొందరు పోలీసు అధికారుల తీరు అవమానకరంగా ఉంది.. పీఏసీ చైర్మన్ పయ్యావుల ఫైర్‌

అనంతపురం : కొంత‌మంది పోలీసు ఆఫీస‌ర్ల తీరు అవ‌మాన‌కరంగా, బాధ‌గా ఉంద‌ని మండిప‌డ్డారు పీఏసీ చైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్‌. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న ఒంగోలులో ఓ కుటుంబాన్ని నడిరోడ్డుపై దించి వేయడం, నెల్లూరు కోర్టులో కాకాని కేసు వివరాలు దొంగలించడం, అనంతపురంలో ఓ నేత జన్మదిన సభకు వేదిక పంచుకోవడం.. వంటివి చూస్తుంటే వైసీపీ నేతలతో పోలీసులు కలిసి పోయారా? అని ఆందోళనగా ఉంద‌న్నారు. నేతల కాళ్ల ద‌గ్గ‌ర‌ యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారుల ఫొటోలతో ఓ పత్రికలో ప్రకటన రావడానికి పోలీసులు అనుమతి ఉందా అని ప్ర‌శ్నించారు. ఉరవకొండలో ఫ్లెక్సీలు వేయడానికి ఎవ‌రు ప‌ర్మిష‌న్ ఇచ్చారు అని అడిగారు.

అనుమతి ఉంటే అధికారులపై చర్యలు తీసుకోవాలని, అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, ప్రకటనలు వేసి ఉంటే.. వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప‌య్యావుల కేశ‌వ్ కోరారు. రిలయన్స్ పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న విశ్వేశ్వర్ రెడ్డితో అదే కేసు నమోదు చేసిన పోలీసు అధికారి వేదిక పంచుకోవడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. పోలీసులు కోడ్ ఆఫ్ కండక్ట్ మర్చిపోయారా… ఈ విషయంపై డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నిఘా వ్యవస్థలు ఏమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను ఉరవకొండ నుంచే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement