Tuesday, April 30, 2024

Exclusive – బిందుసేద్యం పేరిట ₹2 కోట్లు స్వాహా!

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, (ప్రభ న్యూస్)నీటి సౌలభ్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పండ్ల తోటల పెంపకం కోసం 2019 నుంచి ప్రభుత్వం రాయితీపై మైక్రో ఇరిగేషన్ యూనిట్లను మంజూరు చేసింది. ఐదు ఎకరాల లోపు ఎస్సీ ఎస్టీ రైతులకు పూర్తి ఉచితంగా సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం యూనిట్లు మంజూరు చేయగా.. ఇతర వర్గాల రైతులకు 90శాతం సబ్సిడీపై పైప్ లైన్లు వీటికి సంబంధించి యూనిట్లు హార్టికల్చర్ శాఖ ద్వారా మంజూరు చేశారు. ఎస్సీ ఎస్టీ రైతుల ఒక్కో యూనిట్ నుంచి 5 వేలు, 10వేల చొప్పున అధికారులు చేతివాటం ప్రదర్శించారు.

దరఖాస్తు చేసుకున్న మిగతా వేలాది మంది రైతుల నుంచి సబ్సిడీ కాకుండా యూనిటట్కు పది శాతం చొప్పున డబ్బులు బ్యాంకుల్లో డీడీ రూపంలో జమ చేయించారు. పంట విస్తీర్ణాన్ని బట్టి డీడీలు..ఒక్కో రైతు రూ.30 వేల నుండి 50 వేల వరకు తమ పంట విస్తీర్ణాన్ని బట్టి డీడీలు చెల్లించారు. వీటిలో పైరవీలు సాగించిన రైతులకు ఉద్యానవన శాఖ ద్వారా బిందు సేద్యం, సూక్ష్మ సేద్యం యూనిట్లు మంజూరు చేసి మిగతా రైతుల డీడీలను బ్యాంకు సిబ్బందితో మిలాఖత్ అయి అధికారులు తమ అకౌంట్లోకి మార్చేసుకున్నారు.

సబ్సిడీ ఇరిగేషన్ స్కీం కోసం డీడీలు చెల్లించిన రైతులు గుర్తింపు పొందిన ప్రైవేట్ కంపెనీ ఏజెన్సీలు, హార్టికల్చర్ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగి వేసారి పోయారు. డీడీలు కమిషనరేట్ కు వెళ్ళాయని, త్వరలో గ్రౌండింగ్ చేస్తామని ఇంత కాలం బుకాయిస్తూ వచ్చారు. డబ్బులు తిరిగి ఇవ్వాలన్న రైతులు..డీడీలు చెల్లించిన రైతులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పట్టుబట్టడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారంపై రాష్ట్ర ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులు విచారణ జరపగా ముగ్గురు అధికారులు కూడబలుక్కొని సుమారు 2 కోట్లు రైతుల సొమ్ము స్వాహా చేసినట్టు విచారణలో బట్టబయలైంది. మైక్రో ఇరిగేషన్ మాయాజాలంలో రైతుల సొమ్ము బొక్కిన అదిలాబాద్ జిల్లా హార్టికల్చర్ మరియు సెరికల్చర్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, నిర్మల్ జిల్లా హార్టికల్చర్ సెరికల్చర్ అధికారి శ్యామ్ రావు రాథోడ్, కమిషనరేట్ అధికారి కస్తూరి వెంకటేశ్వర్లు ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇస్కాన్ అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. మరింత లోతుగా విచారణ జరిపిస్తే మరి కొంతమంది సిబ్బంది అవినీతి బయటపడే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement