Monday, May 6, 2024

TS | అర్థరాత్రి వచ్చినా వైద్యం అందాలి : పొంగులేటి

ఖమ్మం రూరల్ : అర్థరాత్రి వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందుతుందనే నమ్మకం ప్రజల్లో రావాలని ఆ దిశగా ప్రభుత్వ వైద్యాధికారులు కృషి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో బుధవారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. రూ. 20 లక్షల వ్యయంతో తీర్థాల గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖాన, రూ. 20 లక్షల వ్యయంతో ఆరెకోడు తండా గ్రామంలో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనం, రూ. 20 లక్షల వ్యయంతో గుదిమళ్ళ గ్రామ పంచాయతీలో నిర్మించిన పల్లె దవాఖాన నూతన భవనాలకు ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… వైద్యాధికారులు, సిబ్బంది స్థానికంగా ఉండాలని, కావాల్సిన వసతులు కల్పిస్తామని ఆయన తెలిపారు. ప్రజలను కాపాడుకునే బాధ్యత ఉందని ఆయన అన్నారు. అభయహస్తం కింద 6 గ్యారంటీలు వంద రోజుల్లో ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన అన్నారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ క్రింద వైద్య ఖర్చు రూ. 10 లక్షలకు పరిమితి పెంపు అమలు చేశామన్నారు.

- Advertisement -

త్వరలో మరో 2 కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు, హామీ మేరకు మిగతా కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా 6 గ్యారంటీలను లబ్ధిదారుల గుమ్మానికి పంపించే బాధ్యత చేపడతామన్నారు. ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు, మహిళలకు రూ. 2,500 పెన్షన్, రూ. 500 లకు గ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని… ఇచ్చిన తెలంగాణను కాపాడుకుంటామని మంత్రి అన్నారు.

అనంతరం మంత్రి పెద్ద వెంకటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను సందర్శించారు. పాఠశాల విద్యార్థినులు స్వాగత నృత్య గేయంతో మంత్రికి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మంత్రి, పాఠశాల కాంపౌండ్ ను త్వరలో నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే, పిల్లల తల్లిదండ్రులకు పూర్తి విశ్వాసం కలిగేలా ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. మన పిల్లలకు ఎలా చదివించాలని తపన పడతామో… అలాగే పాఠశాల విద్యార్థులను చదివించాలన్నారు. త్రాగునీటి సరఫరాకు నియోజకవర్గం మొత్తంగా ఒకే కార్యాచరణ చేసి, సురక్షితమైన త్రాగునీరు అందించుటకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఇన్ చార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రాములు నాయక్, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, పీఆర్ ఇఇ పాండురంగ విఠల్, మిషన్ భగీరథ ఈఈలు పుష్పలత, వాణిశ్రీ, ఖమ్మం రూరల్ ఎంపిపి బెల్లం ఉమ, తహసీల్దార్ రామకృష్ణ, మండల విద్యాధికారి శ్యాoసన్, ఎంపిడివో రవీందర్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement