Thursday, May 2, 2024

మాటలు చెప్పుడు కాదు… పీఎంతో మాట్లాడి వడ్లు కొనిపించాలే..

హైదరాబాద్‌, (ప్ర‌భ‌న్యూస్): బాయిల్డ్‌ రైసు విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వాదన అర్థరహితం, అసంబద్దమని, ధర్నాలు, పర్యటనలు ఇక్కడ చేయడం కాదు, పీఎం దగ్గరకు వెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి కోరారు. గత ఏడాది యాసంగి సీజన్‌లో గన్నీ సంచులు కావాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధానమంత్రి మోడికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ మేరకు ధాన్యం కొనుగోలు, కేంద్ర విధానంపై ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల యాసంగిలో సీఎంఆర్‌ కింద బాయిల్డ్‌ రైస్‌ను ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నామని, దశాబ్దలుగా ఇది కొనసాగుతోందని తెలిపారు.

యాసంగిల తెలంగాణలో అధిక ఉష్ణోగ్రత వల్ల రా రైస్‌ (పచ్చిబియ్యం) ఉత్పత్తికి అనుకూలంగా ఉండదని, ధాన్యాన్ని రా రైస్‌గా మారిస్తే నూకలు 30 నుంచి 40శాతం వరకు వస్తాయని, దీనికి ఎఫ్‌సీఐ అనుమతించదని అన్నారు. 25శాతం వరకు మాత్రమే అనుమతిస్తోందని అందుకే యాసంగిలో రా రైస్‌ ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి బాయిల్డ్‌ రైస్‌ను ఇస్తున్నామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఒక వర్గం తప్పుడు సమచారాన్ని వ్యూహాత్మకంగా సోషల్‌ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తోందన్నారు.

తెలంగాణ మినహా ఏ రాష్ట్రం కూడా ఆయా రాష్ట్రాల్లో పండిన పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం లేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వాలు ముందు తమ సొంత డబ్బులతో కొనుగోలు చేయాల్సి రావడమే. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసిన నెల, రెండు నెలల తర్వాతే నిధులను విడుదల చేస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా మారుతోందన్నారు. కేంద్రం రెండు నెలలకు మాత్రమే వడ్డీ చెల్లిస్తోంది, రాష్ట్రం దాదాపు 10 నెలల వడ్డీని భరిస్తోంది. డిమాండ్‌కు తగ్గట్టు- స్టోరేజ్‌ స్పేస్‌నూ చూపించడం లేదు. వ్యాగన్‌ మూమెంట్‌ కూడా సరిగా చేయడం లేదు.

తెలంగాణకు హమాలీ చార్జీలు ఒక్క క్వింటాల్‌కు కేంద్రం రూ.5.65 మాత్రమే చెల్లిస్తుండగా, అదే పంజాబ్‌, హర్యానాల్లో ఒక క్వింటాల్‌కు రూ.24.25 చెల్లిస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గన్నీ సంచులను కూడా సమకూర్చడం లేదన్నారు. ఈ బియ్యమే ఇవ్వాలి… ఆ బియ్యమే ఇవ్వాలంటూ కేంద్రం ఆంక్షలు విధించడం తెలంగాణ రైతాంగానికి గొడ్డలిపెట్టు- లాంటిదని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల భారాన్ని భరించలేక చాలా రాష్ట్రాలు ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement