Sunday, May 5, 2024

NZB: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సేవలు భేష్..

నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 7 (ప్రభ న్యూస్) : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సేవలు భేష్ అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్థులు పి.సామ్ కోషి, సి.సుమలత ప్రశంసించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం లీగల్ సర్వీసెస్ మాడ్యూల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్థులు పి.సామ్ కోషి, సి.సుమలత ముఖ్య అతిథులుగా విచ్చేయగా… జిల్లా ఉన్నతాధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద, అనంతరం కార్యక్రమ వేదిక అయిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి తదితరులు బొకేలు, పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.

జిల్లా యంత్రాంగం, ఇన్నర్ వీల్ క్లబ్ అఫ్ నిజామాబాద్ ల సహకారంతో వివిధ వర్గాల వారికి హైకోర్టు జడ్జీల చేతుల మీదుగా లబ్ది చేకూర్చారు. దివ్యాంగులకు వీల్ ఛైర్లు, హైస్కూల్ విద్యార్థినులకు సైకిళ్ళు, స్నేహ సొసైటీకి చెందిన 18మంది బదిరులకు వినికిడి పరికరాలు, చింతకుంట వృద్ధాశ్రమానికి న్యాయవాది తులసీదాస్ అందించిన 50 బ్లాంకెట్లు, పలువురికి బియ్యం బస్తాలు, లోక్ అదాలత్ లో పరస్పర రాజీమార్గం ద్వారా పరిష్కారమైన కేసులకు సంబంధించి బాధితులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఇద్దరు బాధిత మహిళలకు గ్రామ పంచాయతీల్లో స్వీపర్లుగా ఉద్యోగాలు కల్పిస్తూ నియామక పత్రాలను అందజేశారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో భవన నిర్మాణ రంగ కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సామ్ కోషి మాట్లాడుతూ… జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు. ఇదివరకు ఇద్దరు ట్రాన్స్ జెండర్ లకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించడం, ప్రస్తుతం మరో ఇద్దరు బాధిత మహిళలకు ఉద్యోగ నియామకాలు జరిపేలా కృషి చేయడం అభినందనీయమన్నారు. ఇకముందు కూడా మరింత విస్తృతస్థాయిలో కార్యక్రమాలను చేపడుతూ… నిజామాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని సూచించారు. సమాజంలో సహాయం అవసరమైన వారికి సహకారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా తాము న్యాయపరమైన సేవలకు దూరంగా ఉండిపోతున్నామని సమాజంలోని ఏ ఒక్కరు కూడా అసంతృప్తి భావనకు గురికాకుండా న్యాయవిభాగాల్లో పనిచేస్తున్న వారు తమతమ స్థాయిల్లో అంకితభావంతో సేవలు అందించాలని హితవు పలికారు. జిల్లా యంత్రాంగం, వివిధ స్వచ్చంద సంస్థల సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న తోడ్పాటును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని గౌరవప్రదమైన జీవనాలు వెళ్లదీయాలని సూచించారు.

- Advertisement -

హైకోర్టు న్యాయమూర్తి, నిజామాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి సి.సుమలత మాట్లాడుతూ…. విరామం లేని విధి నిర్వహణలో నిమగ్నమవుతూనే సమాజంలోని వివిధ వర్గాల వారి కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని డీ.ఎల్.ఎస్.ఏ ప్రతినిధులను అభినందించారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ కష్టాలు ఉంటాయని, వాటిని అధిగమించి పైకి ఎదగాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తోడ్పాటు అందించడం సాధ్యపడనందున, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని సమాజంలో గౌరవప్రదమైన గుర్తింపు తెచ్చుకోవాలని, మరో నలుగురికి చేయూతనందించాలని సూచించారు. జిల్లా జడ్జి కె.సునీత మాట్లాడుతూ…. జిల్లా యంత్రాంగం, వివిధ శాఖలు, స్వచ్చంద సంస్థల సహకారంతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ వర్గాల వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని, ట్రాన్స్ జెండర్లకు పొరుగు సేవల పద్ధతిపై ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వ్యవస్థను, లీగల్ ఎయిడ్ క్లినిక్ లను కొనసాగిస్తున్నామని తెలిపారు. లోక్ అదాలత్ ల ద్వారా పరస్పర రాజీ మార్గంగా 38497 కేసులను పరిష్కరించి, బాధితులకు రూ. 22.55 కోట్ల పరిహారం ఇప్పించడం జరిగిందన్నారు.

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ… జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో చేపడుతున్న అనేక కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ది చేకూర్చేందుకు, పలువురికి ఉద్యోగ అవకాశాలకు కల్పించేందుకు డీ.ఎల్.ఎస్.ఏ చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు. ఇకపై భవిష్యత్తులోనూ న్యాయ సేవాధికార సంస్థ చేపట్టే కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్.గోవర్ధన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాస్ చందక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement