Sunday, May 5, 2024

అప్పుల్లో మునిగిన డిస్కమ్‌లు.. విద్యుత్‌ చార్జీలు పెంచే అవకాశం..

హైదరాబాద్‌, (ప్ర‌భ‌న్యూస్): విద్యుత్‌ చార్జీల పెంపుతోనే నష్టాల నుంచి బయటపడాలనే ఆలోచన చేస్తున్నాయి విద్యుత్‌ పంపిణీ సంస్థలు. గత ఐదారేళ్లుగా విద్యుత్‌ వినియోగదారులపై చార్జీల భారం వేయకుండా ప్రభుత్వం చూసినప్పటికీ ఇప్పుడు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. కనిష్టంగా 10 శాతం నుంచి గరిష్టంగా 20 శాతం వరకు చార్జీల పెంపు ప్రతిపాదన ఉండనుందని సమాచారం. అయితే చార్జీలు ఏ మేరకు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తుందనే అంశంపై ఇంకా సర్కార్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక ( ఏఆర్‌ఆర్‌ ) ను త్వరలోనే రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ( ఈఆర్సీ) కి విద్యుత్‌ పంపిణి సంస్థ ( డిస్కమ్‌) లు అందజేయనున్నాయి.

అయితే గత ఐదారేళ్లుగా విద్యుత్‌ చార్జీలు పెంచకపోవడంతో డిస్కమ్‌లపై అప్పుల భారం పెరిగింది. గత మూడేళ్లుగా డిస్కమ్‌లు టారిఫ్‌ సవరణ, ఏఆర్‌ఆర్‌ నివేదికలను సమర్పించలేదు. విద్యుత్‌ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడమే దీనికి కారణం. దీంతో ఏటేటా నష్టాలు పెరగడంతో.. ప్రస్తుతం రూ. 20 వేల కోట్లకు పైగా అప్పులున్నట్లు సమాచారం. తెచ్చిన అప్పులకు ప్రతి నెలా రూ. 800 కోట్ల మేర వడ్డీల కింద డిస్కమ్‌లు చెల్లిస్తున్నాయి. ఉద్యోగుల వేతనాలకు కూడా ఇబ్బందులు వస్తున్నాయని, బ్యాంక్‌ల నుంచి అడ్వాన్స్‌లు తీసుకుని ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిస్కమ్‌లను గట్టెక్కించాలంటే చార్జీలు పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. బహిరంగ విచారణ చేపట్టాక ఏప్రిల్‌ 1 నుంచి నూతన చార్జీల పెంపు అమల్లోకి వస్తాయి.

ఇది కూడా చదవండి: Breaking: రాజస్థాన్ లో బస్సు-లారీ ఢీ.. ఐదుగురు సజీవదహనం

Advertisement

తాజా వార్తలు

Advertisement