Thursday, October 10, 2024

TS: ఏజెన్సీలో డెంగ్యూ డేంజర్ బెల్.. ఒకేరోజు ఇద్దరు మహిళలు మృతి

వాజేడు, సెప్టెంబర్ 14 (ప్రభ న్యూస్): మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలంలో డెంగ్యూ డేంజర్ బెల్ కొడుతుంది. ఒకేరోజు ఇద్దరు మహిళలు డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మృతిచెందారు. అదేవిధంగా రెండు నెలల కాలంలో ఐదుగురు వ్యక్తులు డెంగ్యూ జ్వరంతో మృతిచెందడంతో ఈ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. జ్వరాల బారిన పడిన రోగులకు ఇక్కడి ఆర్ఎంపి వైద్యులు మితిమీరిన వైద్యం చేస్తుండడంతో అనారోగ్యానికి గురై మృతువాత పడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. వారి స్థాయికి మించి వైద్యం చేస్తూ యాంటీబయాటిక్ మందులు ఎక్కువగా వాడుతుండడంతో కిడ్నీలు ఫెయిల్ రోగులు చనిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత వైద్యశాఖ అధికారులు డెంగ్యూ జరాలపై స్పందించకపోవడం ప్రత్యేక క్యాంపులు నిర్వహించకపోవడంతో ప్రజల్లో అవగాహన లేక మృత్యువాత పడుతున్నారు.


ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని ఘనపురం గ్రామానికి చెందిన కురుసం రజిని (37) గత మూడు రోజులుగా జ్వరం రావడంతో స్థానిక జగన్నాధపురం ఓ ఆర్ఎంపి డాక్టర్ వద్ద వైద్యం చేయించుకుంది. ఆమె ఆరోగ్యం బుధవారం క్షీణించడంతో ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ములుగు జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వైద్యం పొందుతూ గురువారం ఉదయం మృతిచెందింది. అదేవిధంగా చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన మనీషా(25) తమ తల్లిదండ్రుల ఊరు అయిన మురుమూరు కాలనీ గ్రామానికి రాఖీ పండుగ నిమిత్తం వచ్చి డెంగ్యూ జ్వరం బారిన పడింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో భద్రాచలం ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ కూడా ఆమె ఆరోగ్యం నయం కాకపోవడంతో ఖమ్మం ప్రైవేటు వైద్యశాలకు తరలించగా.. అక్కడ వైద్యం పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందింది. ఒకేరోజు ఒకే పంచాయతీకి చెందిన వివిధ గ్రామాల్లోని ఇద్దరు మహిళలు డెంగ్యూ జ్వరంతో మృతి చెందడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో ఇంటికి ఇద్దరు చొప్పున జ్వరంతో మంచాన పడి మూలుగుతున్నారు. గడిచిన రెండు నెలల కాలంలో మురుమూరు పంచాయతీలోని కొప్పుసురు గ్రామానికి చెందిన సావిరి రాజు, సాధన పల్లి లాల్ సయాబ్, ఎస్.కె రజిని మృతిచెందగా.. గురువారం మరో ఇద్దరు మహిళలు మృతి చెందడంతో రెండు నెలల కాలంలో డెంగ్యూ జ్వరంతో మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరుకుంది. ఇలా ఒకే పంచాయతీలో డెంగ్యూ జ్వరంతో మృతిచెందుతూ ఉండడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి ఈ ప్రాంత ప్రజలను కాపాడాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement