Monday, April 29, 2024

ప్రైవేటులో స్పెషలిస్ట్ డాక్ట‌ర్లకు డిమాండ్‌.. ప్రభుత్వం కంటే రెండు రెట్లు అధిక జీతం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా, ఏరియా ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల నియామకం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు సవాల్‌గా మారింది. బోధనా కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, స్పెషలిస్టు వైద్యుల నియామకం భారంగా మారుతోంది. ఎందుకంటే ప్రభుత్వ సర్వీసుల్లో చేరేందుకు స్పెషలిస్టు వైద్యులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రయివేటు, కార్పోరేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వ జీతాల కంటే రెండు రెట్లు అధిక జీతం వస్తుండడంతో సర్కారు కొలువులో చేరేందుకు ఇష్టపడడంలేదు. నోటిఫికేషన్‌ ద్వారా రిక్రూట్‌మెంట్‌ చేపట్టినా … విధుల్లో చేరిన కొద్దిరోజులకే ప్రయివేటులో మంచి ఆఫర్‌ రాగానే చెప్పా పెట్టకుండా వదిలేస్తున్నారు. అలాంటి వారి సర్వీసును టర్మినేట్‌ చేస్తూ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినా అటు వైపు నుంచి సమాధానం ఉండడం లేదు. దీంతో నోటీసులు ఇచ్చినా ప్రయోజనం ఏముండుదన్న అభిప్రాయానికి వైద్య, ఆరోగ్యశాఖ వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్‌, గైనకాలజీ, అనెస్థిషియా, పీడియాట్రిక్‌, జనరల్‌ మెడిసిన్‌ తదితర విభాగాల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత ప్రభుత్వ ఆసుపత్రులను వేధిస్తోంది. త్వరలో రాష్ట్ర మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీస్‌ బోర్డు ద్వారా 10వేలకు పైగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, వైద్యులు, నర్సుల, ఏఎన్‌ఎంల పోస్టులను భర్తీ చేయనుంది. పారామెడికల్‌ , ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులను టీఎస్‌ పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. త్వరలో ఈ నియామకాలు జరగనున్నాయి.

అయితే రిక్రూట్‌ అయినప్పటికీ స్పెషలిస్టు వైద్యులు విధుల్లో చేరుతారా..? అన్న ఆందోళన ఇప్పుడు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను పట్టి పీడిస్తోంది. 2018లో రాష్ట్ర వ్యాప్తంగా 911 స్పెషలిస్టు వైద్యులను బోధానాసుపత్రులు, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో రిక్రూట్‌ చేసుకున్నా… చివరకు విధుల్లో చేరింది కేవలం 500 లోపు మాత్రమే. దీంతో ఇదే తరహా పరిస్థితులు 2022లోనూ పునరావృతమవుతాయన్న ఆందోళనలో వైద్య, ఆరోగ్యశాఖ ఉంది. ప్రభుత్వ వైద్యులు ప్రయివేటు ప్రాక్టీసులు నడపకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుండడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేందుకు స్పెషలిస్టు వైద్యులు మరింత విముఖత చేసే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా నేర్పుగా పరిష్కరించాలని సూచిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement