Monday, May 6, 2024

ఆగస్టు 31 వరకు బియ్యం సేకరణ.. గడువు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ ) బియ్యం సేకరణ గడువును కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31 వరకు పొడిగించింది. 2020-21 రబీ సీజన్‌కు సంబంధించి బాకీ ఉన్న 3.6లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇచ్చేందుకు గడువును ఆగస్టు నెలాఖరు వరకు పొడిగించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతోపాటు 2021-22 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి మరో 26 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉండగా… ఆ గడువును డిసెంబర్‌ 31 వరకు పొడగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం రెండు సీజన్‌లలో ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన బియ్యం గడువును ఆగస్టు 31 వరకు పొడగించింది.

కేంద్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయాలని నిర్ధేశించిన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయలేదని, మిల్లుల్లో ధాన్యం నిల్వల్లో తేడాలు ఉన్నాయని ఎఫ్‌సీఐ అందించిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరణను నిలిపివేసింది. దీంతో రాష్ట్రంలో దాదాపు రెండు నెలలపాటు రాష్ట్రంలో సీఎంఆర్‌ ప్రక్రియ నిలిచిపోయింది. అదే సమయంలో వర్షాలు విస్తృతంగా కురవడంతో నిల్వ ఉంచిన ధాన్యం మొలకలు రావడం, మిల్లుల నిర్వహణ కష్టంగా మారడంతో బియ్యం సేకరణ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం సీఎంఆర్‌ బియ్యం సేకరణకు జులై 31 వరకు గడువు ఇచ్చింది. అప్పటికే మిల్లుల్లో ఖరీఫ్‌ తాలూకు , యాసంగి తాలూకు సీఎంఆర్‌ ధాన్యం పెద్ద ఎత్తున నిల్వ ఉండడంతో గడువు పెంచాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement