Thursday, May 23, 2024

BePositive | సీఎం కేసీఆర్ అనుభవజ్ఞుడు, ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా: గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రాజకీయ సవాళ్లు, ప్రతిబంధకాలు తనను ఏమాత్రం అడ్డుకోలేవని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై విమర్శలు చేస్తుంటారని, అలాంటి కువిమర్శలతో నన్ను కట్టడి చేయలేరని ఆమె వ్యాఖ్యానించారు. ఎవరెన్ని చెప్పినా, తాను ఏ స్థాయి పదవిలో ఉన్నా.. ప్రజలతో మమేకమై సేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను రెండు రాష్ట్రాలకు ప్రథమ పౌరురాలిగా ఉన్నప్పటికీ, ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి గిరిగన తండాలకు సైతం వెళ్ళానని గుర్తు చేశారు. తెలంగాణ గవర్నర్‌గా నాలుగేళ్ళు పూర్తిచేసుకుని ఐదో యేట అడుగుపెట్టిన సందర్భంగా శుక్రవారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన మీడియా ఇష్టాగోష్టి కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై మాట్లాడారు.

తాను రాసిన కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు. అడిగినా, అడగకున్నా తన మనసులోని మాటలను మొహమాటం లేకుండా చెప్పుకొచ్చారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రజా సమస్యలపై తాను స్పందిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. మహిళా సాధికారత, వారి ఆరోగ్యం కోసం తనవంతు కృషి చేస్తానని, ఒక డాక్టర్‌గా తన వృత్తి ధర్మాన్ని ఏనాడూ మరిచిపోనని తెలిపారు. దేశ రాజకీయాలపై, క్షేత్రస్థాయి ప్రజల స్థితిగతులపై సీఎం కేసీఆర్‌ విశేష అనుభవం ఉన్నదనీ, గడిచిన కొన్నేళ్ళుగా ఆయనను చూసి చాలా నేర్చుకున్నానని గవర్నర్‌ తమిళిసై ఈ సందర్భంగా వెల్లడించారు. అభిప్రాయ భేదాలే తప్ప, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నానని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షకురాలిగా శక్తివంచన లేకుండా రాష్ట్రానికి తాను సేవలు అందిస్తున్నట్లు- తెలిపారు. ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉంది.. కానీ, రాజ్‌భవన్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పారు. ప్రజలకు మరింత మెరుగ్గా సేవచేయాలని ఉన్నా నిధుల కొరత ఉందని పేర్కొన్నారు.

‘రాజ్‌భవన్‌’ను ప్రజా భవన్‌గా మార్చేశా
రాజ్‌భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చానని తెలిపారు. ఇక్కడ జిల్లాలకు వెళ్తే ఐఏఎస్‌ అధికారులు రారని.. కానీ, పుదుచ్చేరిలో సీఎస్‌ సహా చాలా మందిని పర్యవేక్షిస్తున్నానని పేర్కొన్నారు. తనకెలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని.. తనకు తెలంగాణకు మధ్య దేవుడు ఇచ్చిన బంధం ఉందని వివరించారు. తెలంగాణ ఏర్పా-టైన రోజు, గవర్నర్‌ పుట్టిన రోజు ఒకే రోజు అని ఆనందం వ్యక్తం చేశారు. గవర్నర్‌కు గౌరవం ఇస్తారా.. తన పనిని గుర్తిస్తారా అన్నది అవసరం లేదని చెప్పారు. ఇంకో 30, 40 ఏళ్ల పాటు- ఇదే రకంగా ఉంటానని తెలిపారు. ప్రజారోగ్య వ్యవస్థ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ పేర్కొన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ సహా వివిధ కార్యక్రమాలు ప్రజలకు పూర్తిగా చేరలేదని స్పష్టం చేశారు. వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తోందని.. ఇంకా చేయాల్సి ఉందని తెలిపారు. కొన్ని వసతి గృహాలు, పారిశుద్ధ్యం ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

- Advertisement -

రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదు
రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదని.. ఈ రెండూ చాలా దగ్గరగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు సచివాలయం వెళ్లానని, తన మార్గంలో తాను వెళ్తున్నట్లు- పేర్కొన్నారు. తమ మధ్య అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. కొన్ని బిల్లుల్లో లోపాల్ని గుర్తించి వెనక్కు పంపానని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ బిల్లుపై తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గురువారమే అందిందని, వచ్చిన విజ్ఞప్తుల మేరకు బిల్లు ప్రవేశపెట్టే ముందు పది సిఫారసులు చేశానని చెప్పారు. వాటిని పరిగణలోకి తీసుకున్నారా… లేదా అన్నది చూడాలన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై అందరూ ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందాలని తెలిపారు. కొందరు అకస్మాత్తుగా ఎందుకు మాట్లాడుతున్నారన్న విషయంపై తాను మాట్లాడనని చెప్పారు.

నేను చేసే ప్రతి పనికీ ఓ ప్రత్యేక కారణం ఉంటు-ంది
ప్రజల సంక్షేమం కోణంలోనే తాను ఆలోచిస్తానని గవర్నర్‌ పేర్కొన్నారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలకు కొన్ని ప్రాధాన్యాలు అవసరం, రాజకీయ నామినేషన్‌ కారాదని చెప్పారు. ఇప్పుడు వచ్చిన ప్రతిపాదనలు సరిపోతాయా లేదా అన్నది పరిశీలించేందుకు కొంత సమయం కావాలన్నారు. తాను చేసే ప్రతి దానికి కారణం ఉంటుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా మంచి సంబంధాలు ఉండాలని గవర్నర్‌ అభిప్రాయం వ్యక్తంచేశారు. స్నేహ పూర్వకంగా ఉంటే రాష్ట్రానికి ఇంకా మంచి చేయగలమని స్పష్టం చేశారు.

సనాతన ధర్మాన్ని కించపరచడం తగదు
రాజకీయ లబ్ధి కోసం సనాతన ధర్మాన్ని కించపరిచే వ్యాఖ్యలు తగవని.. ఒక వర్గంపై వివక్ష తగదని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలను పూర్తిస్థాయిలో సమర్థిస్తానని స్పష్టం చేశారు. పదేపదే ఎన్నికలకు అయ్యే వ్యయంతో అన్ని రాష్ట్రాల్లో విద్య అందించవచ్చని గవర్నర్‌ తమిళిసై తెలిపారు. చిన్నప్పటి నుంచి భారతదేశం, భారత్‌ అనడం ఎంతో గర్వంగా ఉందన్నారు. గవర్నర్‌ బాధ్యత ఏంటో తనకు తెలుసునని.. అలాగే ఆమె కూర్చున్న పదవి విలువ తెలుసని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ విమర్శలను ఆమె పట్టించుకోనన్నారు. రాజకీయాల్లో అనేక అంశాలు ఉంటాయని, మజిలీ పవర్‌- మనీ పవర్‌ అనేది తాను పట్టించుకోనని వివరించారు. రాజకీయాలకు అతీతంగా తాను ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతానని, ఎన్ని ఆరోపణలు వచ్చినా తన పంథాను మార్చుకునే ప్రసక్తే లేదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement