Tuesday, May 7, 2024

Delhi | జీ20లో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి.. అంతరిస్తున్న దశలో అరుదైన అవకాశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జీ20 శిఖరాగ్ర సదస్సులో తెలుగు రాష్ట్రాల హస్తకళల ప్రదర్శనకు చోటు దక్కింది. జీ20 వేదిక భారత మండపంలోని హాల్ నెంబర్ 3లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘క్రాఫ్ట్స్ బజార్’ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రత్యేకతలు చాటే హస్తకళా ఉత్పత్తులతో నిండిపోయింది. అందులో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సమావేశానికి హాజరవుతున్న అతిథులకు కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ కళాకారులు రూపొందించిన అశోక చక్ర ఆకారంలో వెండి తీగతో తయారు చేసిన బ్యాడ్జీలు తొడగనున్నారు.

మొత్తం 200 వెండి బ్యాడ్జీలను ఇక్కడి నుండి తరలించారు. అలాగే క్రాఫ్ట్స్ బజార్‌లో నెలకొల్పిన తెలంగాణ రాష్ట్ర స్టాల్‌లో ‘కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ’ హస్తకళారూపాలను ప్రదర్శనకు ఉంచారు. అంతేకాదు.. మాస్టర్ క్రాఫ్ట్స్‌మన్ ఎర్రోజు అశోక్ సందర్శకుల కళ్ల ముందే తన హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అశోక్ తరహాలోనే పలువురు మాస్టర్ క్రాఫ్ట్స్‌మెన్‌ను భారత ప్రభుత్వం రప్పించి, వారి హస్తకళా నైపుణ్యాన్ని విదేశీ అతిథులకు ప్రదర్శించనుంది. వివిధ దేశాల అధినేతలు, వారి కుటుంబ సభ్యులు, ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా సదస్సు వేదిక భారత మండపం లోపలే ఏర్పాటు చేసిన ఈ క్రాఫ్ట్స్ బజార్.. దేశీయ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, తద్వారా మార్కెటింగ్ చేస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎవరికైనా ఈ కళారీతులు నచ్చితే.. వారు కొనుగోలు చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే ఆయా దేశాలకు భారీ మొత్తంలో సరఫరా చేయాలన్న ఆర్డర్లను తీసుకుని, ఎగుమతి చేసేందుకు తగిన వెసులుబాటు కల్పించే వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

తెలంగాణ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీతో పాటు నిర్మల్, చేర్యాల పెయింటింగ్స్, భాగ్యనగర ముత్యాలహారాలు, నగలు, తెలంగాణ ప్రసిద్ధ చేనేత గొల్లభామ చీరలు, పోచంపల్లి, ఇక్కత్, టై అండ్ డై చీరలు ఈ స్టాల్‌లో ప్రదర్శనకు ఉంచారు. వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్ కింద జీఐ ట్యాగింగ్ పొందిన వస్తువులను కూడా ప్రదర్శనకు పెట్టారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టాల్‌లో అడుగు పెట్టగానే ఎదురుగా విజయనగరం – బొబ్బిలి వీణ స్వాగతం పలుకుతుంది. రూ. 47 వేల రూపాయల విలువైన ఆ వీణకు మీనియేచర్ రూపంలో మరొక వీణ అక్కడ ఉంచారు. వాటితో పాటు జీఐ ట్యాగింగ్ కల్గిన వస్తువులు, ప్రసిద్ధ ఉప్పాడ, మంగళగిరి చీరలు, పల్నాడు లాంతర్లు, కొండపల్లి బొమ్మలు, చెక్క విగ్రహాలు ఈ స్టాల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

- Advertisement -

అంతరించే దశలో జీవం
సిల్వర్ ఫిలిగ్రీ అనేది ప్రపంచంలోనే అత్యంత అరుదైన కళారూపం. గత 400 సంవత్సరాలుగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ కళ కొన్నేళ్ల క్రితం దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంది. సన్నని వెండితీగను అల్లుకుంటూ వివిధ రకాల వస్తువులు, రూపాలను తీసుకొచ్చే హస్తకళా నైపుణ్యమే సిల్వర్ ఫిలిగ్రీ. ఈ కళలో మాస్టర్ క్రాఫ్ట్స్‌మన్‌గా ఉన్న ఎర్రోజు అశోక్ తమ కళ అంతరించే దశలో మళ్లీ జీవం పోసుకుందని చెప్పారు. ఒక దశలో కేవలం 10 కుటుంబాలు మాత్రమే ఈ కళరూపాన్ని జీవనాధారం చేసుకోగా.. ఇప్పుడు ఏకంగా 500 కుటుంబాలు ఈ కళ ద్వారా ఉపాధి పొందుతున్నాయని వెల్లడించారు. గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ సంస్థ ద్వారా తమ ఉత్పత్తులకు మార్కెటింగ్, అమ్మకాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

జీ20 సదస్సు సందర్భంగా తమకు అరుదైన అవకాశం లభించిందని, సదస్సుకు హాజరయ్యే అగ్రరాజ్యాధినేతల కోటుకు తాము కోణార్క్ చక్రం – అశోక చక్రం ఆకృతిలో తయారు చేసిన బ్రోచ్ ను పెట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, తద్వారా ప్రపంచదేశాలకు తమ కళ గురించి పరిచయం కలుగుతుందని ఎర్రోజు అశోక్ అన్నారు. జీ20 సదస్సు వేదికలో తాము స్టాల్ ఏర్పాటు చేయడం మరింత సంతోషం కల్గిస్తుందని, తమ కళను ప్రత్యక్షంగా విదేశీ అధినేతలకు చూపించే అవకాశం లభించిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement