Sunday, May 5, 2024

టీడీపీ నుంచే మళ్లీ పోటీ అంటున్న కేశినేని నాని … చంద్రబాబు నిజాయితీ గల వ్యక్తి అంటూ ప్ర‌శంస‌..

అమరావతి, ఆంధ్రప్రభ : సీనియర్‌ తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను టీడీపీలోనే ఉన్నానని వచ్చే ఎన్నికల్లో అదే పార్టీ నుంచి మళ్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు ఆయన చెక్‌ పెడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్లలో ఒక ప్రైవేట్‌ పాఠశాల నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులను ఆయన కొట్టిపారేశారు.

దేశరాజకీయాల్లో చంద్రబాబు చాలా నిజాయితీ గల వ్యక్తని 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చలేని నాయకుడిగా నిలిచారని ప్రశంసించారు. ఐటీ నోటీసులు సాధారణమేనని ఇదేమి పెద్ద విషయం కాదని ఆ నోటీసులకు చంద్రబాబు వివరణ ఇస్తారని పేర్కొన్నారు. ఈ అంశాలన్ని తాత్కాలికమేనన్న కృష్ణాజిల్లా పార్టీ నేతలపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎంతో కష్టపడిన క్రిందిస్థాయి నేతలను ఇప్పటివరకు చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. స్థానిక నేతలు వారిని రాజకీయంగా ఎదగనీయకుండా తమ అవసరాలకు వినియోగించుకుని వదిలేశారని విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో ప్రజాసేవే ముఖ్యమని పదవులు ముఖ్యం కాదన్న ఎంపీ నాని కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. పొత్తుల వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ ఇదంతా అధిష్టానం పరిధిలోదని పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement