Sunday, May 5, 2024

NZB: పౌరుల జీవించే హక్కులను హరించరాదు… జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 24 (ప్రభ న్యూస్) : పౌరుల జీవించే హక్కులను హ‌రించ‌రాద‌ని గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యుల సమావేశంలో జిల్లా జడ్జి, పోలీస్ కమిషనర్ ఉద్భోధ చేశారు. చట్టాల గూర్చి తెలిసి చేసినా, తెలియక చేసినా నేరం నేరమేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఛైర్ పర్సన్ సునీత కుంచాల తెలిపారు. చట్టపరంగా ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే న్యాయ పరిజ్ఞానాన్ని తెలియజేయడానికి వీలుగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యులతో నిజామాబాద్ లో నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. చట్టపరిధిలో పనిచేస్తే సంతోషమేనని, కానీ చట్టవ్య తిరేకమైన చర్యలు ఆమోద యోగ్యం కావన్నారు. అనవసరమైన సమస్యలు సృష్టించి చట్టపరమైన చిక్కుల్లో చిక్కరాదనే అభ్యర్థనను అర్థం చేసుకుని మెలగాలని ఆమె కోరారు. గ్రామ అభివృద్ధి కమిటీలు చట్టాలకు అను గుణంగా కార్యక్రమాలు చేస్తే అన్ని ప్రభుత్వ శాఖల తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు.

గ్రామ అభివృద్ధి ఆలోచనలు అమృతమే కావాలి కానీ విషతుల్యం కావొద్దు .. సిపి కల్మేశ్వర్ సింగేనవార్
గ్రామ అభివృద్ధి ఆలోచనలు అమృతమే కావాలి కానీ విషతుల్యం కావొద్దని, త‌మ ఆలోచనలకు, భావనలకు ఆచరణరూపం ఇవ్వాల్సింది గ్రామ అభివృద్ధి కమిటీలేననీ నిజామాబాద్ పొలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్ అన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీల పేరులలో అభివృద్ధి అనే పదం ఉన్నదని దానిని తప్పు పట్టగలమా.. అని ఆయన ప్రశ్నించారు. సమస్య ఎక్కడున్నదంటే అభివృద్ధి పేరున వేరొకరి అభివృద్ధిని, సహజంగా జీవించేహక్కులను చెరిపి వేయరాదనే విషయాన్ని ప్రతివారు గౌరవించాలని తెలిపారు. కుల బహిష్కరణలకు పాల్పడడం, సామాజిక దండనలు, వెలివేతలు చేయడంతో పోలీసుశాఖ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. గ్రామాలలో అందరు కలిసిమెలిసి జీవించడమే గీటురాయిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజా వెంకట రెడ్డి, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ యెండల ప్రదీప్, నిజామాబాద్ బార్ అసోసి యేషన్ ఉపాఢ్యక్షుడు ఆశ నారాయణ, న్యాయసేవ సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్,గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యులు,వివిధ పోలీస్ స్టేషన్ ల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement