Monday, April 29, 2024

ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసమే బాల రక్షక్ : మంత్రి త‌ల‌సాని

ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసమే బాల రక్షక్ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద హైదరాబాద్ జిల్లాకు మంజూరైన రెండు బాల రక్షక్ వాహనాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలెక్టర్ శర్మన్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం 1098 హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసి, జిల్లాకు ఒకటి చొప్పున సీఎస్ఆర్ నిధులతో బాలరక్షక్ వాహనాలను కేటాయించిందని చెప్పారు. హైదరాబాద్ జిల్లాకు రెండు వాహనాలను కేటాయించగా, అవి ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

అనాధ బాలలు, భిక్షాటన చేస్తూ 18 సంవత్సరాల్లోపు పిల్లలు ఎక్కడ కనిపించినా, బాల్య వివాహం జరుగుతున్నా కానీ 1098 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని కోరారు. హెల్ప్ లైన్ కు కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి ప్రొటెక్షన్ ఆఫీసర్, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ అధికారులు బాలరక్షక్ వాహనంతో చేరుకొని వారిని రక్షించి, బాల సదనంకు చేర్చి వారికి వసతి, బోజన సౌకర్యం కల్పిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ వివరించారు. పరిస్థితులను బట్టి పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారుల సహకారం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మహిళా శిశుసంక్షేమ శాఖ పర్యవేక్షణలో బాల రక్షక్ వాహనాలు నిర్వహించబడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ సుమలత, సికింద్రాబాద్ సీడీపీఓ సునంద, ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement