Sunday, December 8, 2024

ప‌రిశ్ర‌మ‌ల‌పై విద్యుత్ భారం..

కొవిడ్‌ అనంతర పరిస్థితులతో ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న పరిశ్రమల రంగానికి తాజాగా డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్‌ ఛార్జీల పెంపు మరింత భారం కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని రెండు డిస్కంలైన దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌), ఉత్తరప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎన్పీ డీసీఎల్‌)లు ఇటీవల సమర్పించిన విద్యుత్‌ టారిఫ్‌ పెంపు ప్రతిపాదను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండ లి (టీఎస్‌ఈఆర్సీ) ఆమోదిస్తే వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి పెంచిన విద్యుత్‌ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. టారిఫ్‌ పెంపు ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం లాంఛనమే అన్న విషయం తెలిసిందే. దీంతో పెంచిన ఛార్జీలు అమలులోకి రావడం ఖాయం. అయితే గృహ, వాణిజ్య కేటగిరీ విద్యుత్‌ టారిఫ్‌ పెంపును పక్కనపెడితే ఎల్‌టీ, హెచ్‌టీ కేటగిరీలోని పరిశ్రమలకు మాత్రం తాజా ఛార్జీల పెంపు ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక భారంగా పరిణమించనుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్‌టీ కేటగిరీ లోని అన్ని రకాల వినియోగదారులకు యూనిట్‌కు రూ.50 పైసలు పెంచగా, హెచ్‌టీ కేటగిరీ వినియోగ దారులకు యూనిట్‌ విద్యుత్‌కు ఒక రూపాయిని డిస్కంలు పెంచాయి. ఎల్‌టీ కేటగిరీలో చిన్న పరిశ్రమలుండగా, హెచ్‌టీ కేటగిరీలో పెద్ద పరిశ్రమలున్నాయి.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు విద్యుత్‌ సరఫరా చేసే దక్షిణ డిస్కం టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలోనే రాష్ట్రంలోని ఎక్కువ చిన్న, భారీ పరిశ్రమలు నడుస్తున్నాయి. దక్షిణ డిస్కం తాజాగా విడుదల చేసిన 2019-20 వార్షిక నివేదికలోని గణాంకాల ప్రకారం డిస్కం పరిధిలో ఎల్‌టీ-3 కేటగిరీలో 43779 చిన్న, మధ్య తరహా పరిశ్రమల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా హెచ్‌టీ -1 కేటగిరీలో 5262 భారీ పరిశ్రమల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు కేటగిరీల్లో యూనిట్‌ విద్యుత్‌కు సగటున రూ.7.60 పై సలను పరిశ్రమల వినియోగదారులు చెల్లిస్తున్నారు. తాజా విద్యుత్‌ ఛార్జీల పెంపు అమలులోకి వస్తే ఎల్‌టీ కేటగిరీలోని పరిశ్రమలకు యూనిట్‌కు రూ.50 పైసలు హెచ్‌టీ కేటగిరీలోని పరిశ్రమలకు యూనిట్‌ విద్యుత్‌కు ఒక రూపాయి పెరగనుంది. ఎల్‌టీ కేటగిరీలో 43వేలకు పైగా పరిశ్రమలున్నప్పటికీ ఇవి ఏడాదికి వాడే విద్యుత్‌ హెచ్‌టీ కేటగిరీలోని పరిశ్రమలు వాడే విద్యుత్‌ కంటే చాలా తక్కువగా ఉంటుంది. దక్షిణ డిస్కం పరిధిలో 2019-20 ఆర్థిక ఏడాదిలో ఎల్‌టీ కేటగిరీలోని పరిశ్రమల వినియోగం 846 మిలియన్‌ యూనిట్‌లు ఉండగా, హెచ్‌టీ కేటగిరీలోని పరిశ్రమల వినియోగం ఇదే ఏడాదిలో 10774 మిలియన్‌ యూనిట్‌లుగా ఉంది.

ఈ గణాంకాల ప్రకారం సుమారు రూ.1000 కోట్లకుపైగా కేవలం దక్షిణ డిస్కం పరిధిలోని పరిశ్రమల నుంచే పెంచిన విద్యుత్‌ ఛార్జీల ఆదాయం రానుంది. ఉత్తర డిస్కం పరిధిలోని ఆదాయం దీనికి అదనం. రెండు డిస్కంల పరిధిలో సమారు రూ. 1500 కోట్ల వరకు రాష్ట్రంలోని పరి శ్ర మల మీద తాజా ప్రతిపాదించిన విద్యుత్‌ ఛార్జీల పెం పు భారం పడ నుందని స్పష్టమవుతోంది. డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్‌ ఛార్జీల పెంపుతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక తదితర రంగాలన్నింటిపై కలిపి రూ.6500 కోట్లకు పైగా భారం పడనున్న విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement