Saturday, May 18, 2024

Breaking: సాగును దెబ్బ‌తీసేలా కేంద్రం చ‌ర్య‌లు.. అడ్డంకులు వ‌చ్చినా రైతుల‌ను ఆదుకుందాం: కేసీఆర్‌

వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న దేశంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా తిరోగమన విధానాలు అవలంబిస్తుండడంపై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పనిచేస్తున్న దేశ రైతుల‌ను ప్రోత్సహించకుండా నిరుత్సాహపరిచే చర్యలు చేపట్టడం, దేశంలో పంటల దిగుబడిని పెంచే దిశగా కాకుండా ఉత్పత్తిని తగ్గించేలా అపసవ్య విధానాలను అమలు చేస్తుండడం బాధాకరమని కేసీఆర్ అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల‌ సంక్షేమం కోసం కార్యాచరణను మరింత పటిష్టంగా కొనసాగిస్తూనే ఉంటుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.

వానాకాలం మరికొద్ది నెలల్లో రానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డికి, ఆ శాఖ‌ అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. పత్తి, మిర్చి, కంది, వాటర్ మిలన్ తదితర ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని కేసీఆర్ వారితో అన్నారు. కాగా, ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడం, వానాకాలం వ్యవసాయ ముందస్తు ఏర్పాట్ల సన్నద్ధతపై ఇవ్వాల (మంగ‌ళ‌వారం) ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన వ‌డ్ల‌ సేకరణ పురోగతి పై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

లాభదాయక పంటల సాగుపై ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు సీఎం కేసీఆర్‌. జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు మరింత విస్తృతంగా క్రేత్రస్థాయిలో పర్యటించాలని, గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు నిరంతరం పంటపొలాల్లో, గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు తగు సూచనలు అందించాలన్నారు. ఆ దిశగా అవగాహన పెంపొందించాలని,అందుకు ఏఈ అధికారులకు నిరంతరం శిక్షణా తరగతులను నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి సిఎం సూచించారు. వ్యవసాయ అధికారుల బాధ్యతలు, విధుల నిర్వహణ పై జాబ్ చార్ట్ తయారు చేయాలన్నారు.

ఈ సమీక్షలో సీఎస్ సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శులు భూపాల్ రెడ్డి, రాహుల్ బొజ్జా, స్మితా సభర్వాల్, వి.శేషాద్రి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్, వ్యవసాయశాఖ అడిషనల్ డైరక్టర్ కె.విజయ కుమార్, జాయింట్ డైరక్టర్ కె.రాములు, అసిస్టెంట్ డైరక్టర్ మాధవి,వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషన్మంతు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement