Saturday, April 27, 2024

ఊరిస్తున్న ఉప ఎన్నికలు.. ఊహల పల్లకిలో ఆశావహులు

నారాయణపేట ప్రతినిధి, ప్రభన్యూస్ : నారాయణపేట జిల్లాలో వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యుల స్ధానాలకు ఉప ఎన్నికల నిర్వహణ చాలాకాలంగా ఊరిస్తోంది. ఆయా స్ధానాలు ఖాళీగా ఉండి దాదాపు ఏడాది పైనే అయినప్పటికి వివిధ కారణాల వల్ల నేటికి ఈ స్ధానాల్లో ఉప ఎన్నికలను నిర్వహించలేదు. దీంతో చాలా కాలంగా ఊహల పల్లకిలో విహరిస్తున్న ఆశావహులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మక్తల్‌ మండలం కర్ని గ్రామ సర్పంచ్‌ పదవి ఖాళీగా ఉండి దాదాపు 19నెలలు గడిచినప్పటికి నేటికి ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహించక పోవడంతో గ్రామంలో అబివృద్ది కుంటుపడింది. ఉప సర్పంచ్‌కు తాత్కాలిక సర్పంచ్‌గా భాద్యతలు అప్పగించినప్పటికి అబివృద్ది పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.

అలాగే కృష్ణ మండలం తంగిడి, దామరగిద్ద మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో సైతం సర్పంచ్‌ పదవులు వివిధ కారణాల చేత చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆ గ్రామాల్లో సైతం అభివృద్ది పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. దీంతో పాటు జిల్లాలోని వివిధ మండలాల్లో ఏడు ఉప సర్పంచ్‌ పదవులు, మరో 45వార్డు సభ్యుల స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. దేశమంతటా సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు, స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికి నారాయణపేట జిల్లాలో మాత్రం ఖాళీగా ఉన్న స్ధానాలకు ఉప ఎన్నికలు నిర్వహించక పోవడం పట్ల జిల్లా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లో అభివృద్ది పనులతో పాటు సంక్షేమ పథకాల అమలులో సర్పంచ్‌ , ఉప సర్పంచ్‌, వార్డు సభ్యుల పాత్ర కీలకమైంది. అయినప్పటికి ఖాళీగా ఉన్న ఈ స్ధానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆయా గ్రామాల్లో కీలకమైన వైకుంఠదామాలు, రైతు వేధికలు, సిసి రోడ్లు, మరుగు కాలువలు వంటి అభివృద్ది పనులు నత్తనడక సాగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామాల్లో ఉప ఎన్నికలు తక్షణమే నిర్వహించి గ్రామాల అభివృద్దికి బాటలు వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఖాళీగా ఉన్న స్ధానాలు ఇవే..

మక్తల్‌ మండలం కర్ని , కృష్ణ మండలం తంగిడి, దామరగిద్ద మండలం లింగారెడ్డిపల్లి గ్రామాల్లో సర్పంచ్‌ పదవులు, ధన్వాడ మండలం మంత్రోనిపల్లి, చీకర్లగడ్డతండా, నర్వ మండలం ఉందెకోడు, పాతర్చేడు, ఊట్కూర్‌ మండలం వల్లంపల్లి , మరికల్‌ మండలం పెద్దచింతకుంట, కోస్గి మండలం కుమ్మరికుంటతండా పంచాయతీల్లో ఉప సర్పంచ్‌ పదవులు ఖాళీగా ఉన్నాయి.

- Advertisement -

ఖాళీగా ఉన్న వార్డు స్ధానాలు ఇవే..

నారాయణపేట మండలం కోటకొండ, తిరుమలాపర్‌, బైరంకొండ, శేర్నపల్లి, బోయిన్‌పల్లితండా, మేక హనుమాన్‌తండా, జలాల్‌పూర్‌ఒ, కొల్లంపల్లి, ధన్వాడ మండలంలోని కిష్టాపూర్‌, చీకర్లగడ్డతండా, మడిగీములతండా పాతతండా, మంత్రోనిపల్లి, మద్దూర్‌ మండలంలోని దమగ్నాపూర్‌లో రెండు, గోకుల్‌నగర్‌, పరసాపూర్‌, కోస్గి మండలంలో నాచారం, బోగారం, ముదిరెడ్డిపల్లి, కుమ్మరికంటతండా, ముక్తిపహాడ్‌, పోలేపల్లి, చెన్నారం, దామరగిద్ద మండలంలో గత్ప, మల్‌రెడ్డిపల్లి, విఠలాపూర్‌, మొగల్‌ మడకలో వార్డు స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే మరికల్‌ మండలం తీలేరులో2, పసుపుల, పెద్ద చింతకుంట, ఊట్కూర్‌ మండలం వల్లంపల్లి, మొగ్దుంపూర్‌, మల్లెపల్లి, మాగనూర్‌ మండలం ఉజ్జెల్లి, వడ్వాట్‌, పర్మన్‌దొడ్డి, కొత్తపల్లి, నర్వ మండలం ఉందెకోడ్‌, పాతర్చేడు, మక్తల్‌ మండలం ఖానాపూర్‌, సామన్‌పల్లి, గుడిగండ్ల, కృష్ణ మండలం కృష్ణ మండల కేంద్రంలో ఒక్క వార్డు స్ధానాలు ఖాళీగా ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement