Monday, April 29, 2024

Bad News: పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీలో మరో విషాదం.. మ‌రొక‌రికి గుండెపోటు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇంకా అంతా మ‌రిచిపోనేలేదు.. కుటుంబ సభ్యులు ఇప్పటికీ పునీత్ మరణం నుంచి బయటకు రాలేకపోతున్నారు. అంతలోనే ఆ కుటుంబానికి మరో పిడుగు లాంటి వార్త వచ్చింది. పునీత్ చ‌నిపోయి 4 నెలలు కూడా కాకముందే ఆ కుటుంబంలో మరొకరు దూరమయ్యారు. పునీత్ రాజ్ కుమార్ మామ రేవనాథ్ గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన ఎవరో కాదు పునీత్ భార్య అశ్విని తండ్రి. అల్లుడు మరణం తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. అప్పటి నుంచి తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు రేవనాథ్. కళ్ల‌ ముందు ఎంతో ఆరోగ్యంగా ఉన్న అల్లుడు పునీత్.. ఒక్కసారిగా గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో ఆయన తట్టుకోలేకపోయాడు. గత నాలుగు నెలలుగా రేవనాథ్ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది.

తాజాగా ఆయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే ఆయ‌న మరణించారు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. భర్త మరణం తర్వాత తనకు అన్ని విధాలుగా అండదండగా ఉన్న తండ్రి కూడా చ‌నిపోవ‌డంతో అశ్విని దుఃఖం ఎవరూ తీర్చలేక పోతున్నారు. ఆమెను చూసి అందరూ అయ్యో పాపం అంటున్నారు. భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు ఇప్పుడు తండ్రి మరణం కోలుకోలేని విషాదంలోకి నెట్టేసింది.

ఇదిలా ఉంటే రాజ్ కుమార్ కుటుంబాన్ని గుండెపోటు మాత్రం వదలడం లేదు. 2006లో కన్నడ నట చక్రవర్తి రాజ్ కుమార్ గుండెపోటుతో చ‌నిపోయారు. ఇక గతేడాది అక్టోబర్ 29న పునీత్ కూడా హార్ట్ ఎటాక్ తోనే కన్నుమూశారు. ఇప్పుడు ఆయన మామ సైతం గుండెపోటుతో చ‌నిపోవ‌డం విషాదకరం. ఆరేళ్ల కింద పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ కూడా గుండెపోటుకు గురయ్యారు.. కానీ ఆయన ప్రాణాలతో బయట పడ్డారు. మరో అన్నయ్య రాఘవేంద్ర రాజ్ కుమార్ గుండెపోటుతోపాటు పక్షవాతం వచ్చింది. ఇలా కొన్ని రోజుల వ్యవధిలోనే వాళ్ళ కుటుంబంలో ఇలా ఇద్దరు గుండెపోటుతో చ‌నిపోవ‌డం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement