Sunday, May 5, 2024

మ‌హిళ‌ల జీవితాల్లో
కొత్త వెలుగు స‌ఖీ

సూర్యాపేట :
మ‌హిళా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌త్యేకంగా స‌ఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామ‌ని, దాదాపు మ‌హిళ‌ల‌కు సంబంధించిన అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌య్యేవిధంగా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దుతామ‌ని మంత్రి గుంట‌కండ్ల జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు.
మహిళల రక్షణ విషయంలో దేశం గర్వించే విధంగా తెలంగాణ ముందుకు సాగుతోంద‌న్నారు. సూర్యాపేట జిల్లా కుడ-కుడ లో 50 లక్షల వ్యయంతో నిర్మించే స‌ఖి కేంద్రానికి ఆయ‌న శంకుస్థాప‌న చేశారు. ఈ కేంద్రం మహిళల అన్ని సమస్యల పరిష్కారానికి వన్ స్టాప్ సెంటర్‌గా ప‌నిచేస్తుంద‌న్నారు. ఆడపిల్లల పట్ల నేరాలకు పాల్పడిన దోషులను కూడా సకాలంలో పట్టుకుని శిక్షిస్తున్నామని గుర్తు చేశారు. మహిళల పట్ల నేరాలు తగ్గించే విధంగా, వారికి న్యాయ పర సేవలు సకాలంలో ఇచ్చే విధంగా ఈ సఖీ కేంద్రాల ద్వారా పని చేస్తున్నామని పేర్కొన్నారు. గృహ హింసలు, భౌతికంగా, మానసికంగా కుంగిపోయి, నిరాశ, నిస్పృహలతో బతుకు భారంగా వెళ్ల‌దీస్తున్న మహిళల జీవితాలో కొత్త వెలుగులు నింపడానికి సఖి కేంద్రం పని చేస్తుందన్నారు. వివిధ సామాజిక సమస్యలతో సతమతమవుతున్న వారు మానసికంగా, శారీర‌కంగా బలపడడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి, వారికీ అవసరమైన చట్టపరమైన, న్యాయ సలహాలు అవసరమైన న్యాయ సహాయం అందిస్తామన్నారు. స్వయం ఉపాధి వైపు శిక్షణ ఇచ్చి ఆర్ధికంగా స్థిరపరుస్తామన్నారు.దీనికి ప్రజలు సహకరించాలని, మానసికంగా, నిరాశ, నిస్పృహలతో ఉన్న స్త్రీల వివరాలు ఎవరికైనా తెలిస్తే హెల్ప్ లైన్ 181 కి సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ,స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ అధికారులు కౌన్సిలర్ అభయ్, భరత్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement