Thursday, April 25, 2024

సింగరేణిలో వేల కోట్ల దోపిడీకి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర.. ఫిర్యాదు చేసిన ప‌ట్టించుకోని మోడీ: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సింగరేణి సంస్థకు కేంద్రం ఒడిశాలో కేటాయించిన సైనీ బొగ్గు గనిని ప్రైవేటీకరించడం వెనుక రూ.50 వేల కోట్ల దోపిడీకి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఇది రూ.35 వేల కోట్ల రాఫెల్‌ కుంభకోణం కంటే పెద్దదన్నారు. దీనిపై తాము ఫిర్యాదు చేసినా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంద‌ని రేవంత్‌ ప్రశ్నించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సహా రాష్ట్రానికి వచ్చిన ప్రతి బీజేపీ నాయకుడు కేసీఆర్‌ కుటుంబం అవినీతికి పాల్పడిందని త్వరలోనే జైలుకు పంపుతామని ప్రకటనలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అయితే.. ఇప్పుడు కేసీఆర్‌ కుటుంబం అవినీతిపై ఆధారాలతో సహా సింగరేణి వ్యవహారంపై తాము ఫిర్యాదు చేస్తే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య విభేదాలున్నాయని జనాల ముందు నాటకాలాడుతున్నాయని విమర్శించారు. ఈ విషయంపై మార్చి 14 నుంచి పార్లమెంట్‌ సమావేశాల్లో మాట్లాడతామని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, షబ్బీర్‌ అలీ, మల్లు రవి తదితరులతో కలిసి రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

సింగరేణి సంస్థలో 51 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా, 49 శాతం కేంద్రం వాటా ఉందన్నారు రేవంత్‌రెడ్డి. దాదాపు 50 వేల మంది కార్మికులకు అండగా ఉందని, విద్యుత్‌ ఉత్పత్తికి ఉపయోగపడుతుందన్నారు. అలాంటి సింగరేణి సంస్థ బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు కేంద్రం అమ్మడానికి ముందుకు వస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. నాణ్యమైన నైనీ బొగ్గు గనిని సింగరేణికి కాకుండా అదాని సహా మూడు ప్రైవేటు సంస్థలకు 25 సంవత్సరాల లీజుకు ఇవ్వడానికి సీఎం కేసీఆర్‌ తన అధికారాన్ని వినియోగించుకుని ప్రైవేటు పరం చేసే కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. 2016, జనవరి1 నుంచి సింగరేణి సిఎండిగా ఉన్న శ్రీధర్‌ పదవీకాలాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం పొడిగించడం వెనుక అనుమానాలు ఉన్నాయన్నారు. డీవోపీటీ నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిదేళ్ళగా సింగరేణి సీఎండీగా ఐఏఎస్‌ అధికారి శ్రీధర్‌ కొనసాగుతున్నారని అన్నారు. సింగరేణి సంస్థలో రూ 200 కోట్ల డీజెల్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీధర్‌ను ఎందుకు తొలగించడం లేదని రేవంత్‌ రెడ్డి నిలదీశారు. పశ్చిమ బెంగాల్‌లో డీజీపీని ట్రాన్స్‌ఫర్‌ చేసిన కేంద్రం శ్రీధర్‌ విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. అంటే కేసీఆర్‌ ప్రభుత్వ నిర్ణయాలకు కేంద్రం మద్దతు ఉన్నట్లు తాము భావించాల్సి ఉంటుందన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా..
గతంలో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు కేటాయించినప్పుడు పాటించాల్సిన కొన్ని నిబంధనలను రూపొందించిందని రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఆ మేరకు మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ ఆపరేషన్‌ (ఎండీవో) విధానంలో జాయింట్‌ వెంచర్‌, కన్సారియం, టెండర్‌ బిడ్స్‌ ఓపెన్‌ చేసిన తర్వాత రివర్స్‌ బిడ్డింగ్‌కు అవకాశం ఇవ్వాలని, ఈ నిబంధనల మేరకే కోల్‌ ఇండియా దేశంలోని బొగ్గు గనులను కేటాయిస్తుందన్నారు. అయితే ఒడిశాలోని నైనీ బొగ్గు గని కేటాయింపు విషయంలో మాత్రం సింగరేణి తనకు కావాల్సిన వారి కోసం నిబంధనలు తుంగలోకి తొక్కిందని ఆయన ఆరోపించారు. జాయింట్‌ వెంచర్‌, కన్సారియం కాకుండా సింగల్‌ ఎంటీటీ (ఒకే సంస్థ)కి అవకాశమిస్తామని, టెండర్‌ దక్కించుకున్న సంస్థ తర్వాత ఆర్ధిక భాగస్వామిగా మరొకరిని చేర్చుకోవచ్చనే నిబంధనను సింగరేణి తీసుకొచ్చిందన్నారు. ఈ క్రమంలో నైనీ బొగ్గు గనిని అదాని సంస్థకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. అదానికి టెండర్‌ దక్కితే.. ఆయన ఆర్ధిక భాగస్వామి కింద సీఎం కేసీఆర్‌ బినామీ ప్రతిమ శ్రీనివాస్‌ తెరపైకి రానున్నారని ఆయన అన్నారు. దీంతో రూ.50 వేల కోట్ల దోపిడికి కేసీఆర్‌ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

ఫిర్యాదు చేసిన చర్యలు లేవు
సింగరేణిలో జరుగుతున్న కుంభకోణంపై తన సహచర ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలసి ప్రధాని మోడీ, కోల్‌ ఇండియా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి సహా దేశంలోని అన్ని రకాల విచారణ సంస్థలకు ఫిర్యాదు చేశామని రేవంత్‌ రెడ్డి చెప్పారు. మంత్రి ప్రహ్లాద్‌ జోషికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే, తాము చేసేది ఏమీ లేదని, తెలంగాణలోని అవినీతి వ్యవహారమంతా ప్రధాని కార్యాలయం చూసుకుంటుందనే సమాధానం వచ్చిందని రేవంత్‌ తెలిపారు. కనీసం సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌కు ఫిర్యాదును ఫార్వర్డ్‌ చేయమని కోరితే, అది కూడా తాము చేయలేమని కేంద్ర మంత్రి చేతులెత్తేశారని ఆయన చెప్పారు. దీనిని బట్టి కేంద్రంలోని మోడీ సర్కార్‌, సీఎం కేసీఆర్‌కు ఎంత అనుబంధం ఉందో అర్ధమవుతుందన్నారు.

మూడోసారి మోడీని ప్రధానిని చేసేందుకు కేసీఆర్‌ కృషి
యూపీఏ భాగస్వామ్య పార్టీలను చీల్చడం ద్వారా కాంగ్రెస్‌ను బలహీనపరిచి, మూడోసారి నరేంద్ర మోడీని ప్రధాన మంత్రి చేసేందుకు సిఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ ముంబై పర్యటన ఒక డ్రామా అని ఆయన విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొందరి సీఎంల అవినీతిపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా కలిసి సీబీఐ విచారణకు ఆదేశించారని, అదే ఎనిమిదేళ్ళుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ అవినీతిపై ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదో అర్ధం చేసుకోవాలన్నారు. ప్రస్తుతంఎన్నికలు జరుగుతున్న యూపీ వెళ్ళి బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసే ధైర్యం సీఎం కేసీఆర్‌కు ఉందా? అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాకరే, శరద్‌ పవార్‌, ఎంపీ సుప్రియ సులే వంటి నేతలను కలిసిన సీఎం కేసీఆర్‌.. ఏపీ సిఎం జగన్‌, ఢిల్లిd సీఎం కేజ్రీవాల్‌. నవీన్‌ పట్నాయక్‌, నితీష్‌ కుమార్‌, మాయవతి, అఖిలేష్‌ యాదవ్‌ వంటి నేతలను ఎందుకు కలవడం లేదని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement