Friday, March 29, 2024

Big Story: ఈసారి హరిత టార్గెట్‌ పెద్దదే.. ఉమ్మడి రంగారెడ్డిలో 2.20కోట్ల మొక్కల టార్గెట్​

ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడి రంగారెడ్డి: అటవీ సంపదను 33 శాతానికి పెంచేందుకు టీఆర్ ఎస్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత హరితహారం కార్యక్రమంలో భాగంగా భారీగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఏడు విడతలు విజయవంతంగా పూర్తి చేశారు. వచ్చే వర్షాకాలంలో ఎనమిదవ విడత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2.20కోట్లమేర మొక్కలు నాటేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇందుకు కావల్సిన నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పంచాయతీల వారీగా నర్సిరీలు ఏర్పాటు చేసి మొక్కలు సిద్ధం చేస్తున్నారు. గత వర్షాకాలంలో నాటిన మొక్కలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వేసవికాలంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా వాటిని కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అత్యంత ఇష్టమైన కార్యక్రమం హరితహారం. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2015 సంవత్సరంలో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సంవత్సరం జిల్లాల వారీగా టార్గెట్‌లు ఇస్తూ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అటవీ సంపద రోజురోజుకు తగ్గిపోతోంది. దీంతో వనాల్లో ఉండాల్సిన కోతులు జనాల్లోకి వస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో వాటికి కావల్సిన ఆహారం లభించకపోవడంతో జనవాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. రాష్ట్రంలో అటవీ సంపదను 33 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగానే గత ఏడు సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. 33 శాతానికి అడవులు చేరితే సకాలంలో వర్షాలు కురిసి పంట పొలాలు సస్యశామలం అవుతాయి. ఇదే లక్ష్యంతో ప్రతి సంవత్సరం పెద్దఎత్తున హరిహారం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. వర్షాల సీజన్‌ ప్రారంభమైన తరువాత పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే….

ఈసారి టార్గెట్‌ 2.20కోట్ల మొక్కలు..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈసారి పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఇప్పటికే ఏ జిల్లాలో ఎంతమేర మొక్కలు నాటాలనే దానిపై లక్ష్యాలను ఫిక్స్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని నిర్ణయించారు. అందులో భాగంగా శాఖల వారీగా టార్గెట్లు ఇచ్చారు. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో 60.62లక్షలు, వికారాబాద్‌ జిల్లాలో 60.11లక్షల మేర ఎనమిదవ విడత హరితహారంలో మొక్కలు నాటేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1100 పైగానే గ్రామ పంచాయతీలున్నాయి. 26 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి. దీంతోపాటు అవుటర్‌ రింగ్‌రోడ్డు కూడా ఉంది. అన్ని ప్రాంతాల్లో భారీగా మొక్కలు నాటాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీల వారీగా నాటేందుకు కావల్సిన మొక్కలు నర్సిరీల్లో సిద్ధం చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో నర్సరీల్లో డిమాండ్‌ మేరకు కావల్సిన మొక్కలు పెంచుతున్నారు. పూలు, పండ్ల మొక్కలకు చాలా ప్రాంతాల్లో డిమాండ్‌ ఉంది. వీటిని ఎక్కువగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలతోపాటు పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎనమిదవ విడత హరితహారం

కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. గతసారి టార్గెట్‌కు మించే..

- Advertisement -

ఏడవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా టార్గెట్‌కు మించి మొక్కలు నాటారు. 2021 సంవత్సరంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో టార్గెట్‌కు మించి మొక్కలు నాటగా మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో మాత్రం కొంతమేర వెనకబడ్డారు. గత ఏడాది రంగారెడ్డి జిల్లాలో 74.01లక్షల మేర మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా దానికిమించే మొక్కలు నాటారు. 89.02లక్షల మేర మొక్కలు నాటి శభాష్‌ అనిపించుకున్నారు. వికారాబాద్‌ జిల్లాలో కూడా లక్ష్యానికి మించే మొక్కలు నాటారు. ఈ జిల్లాలో 40.25లక్షల మేర మొక్కలు నాటాలని నిర్ణయించగా 42.46లక్షల మేర మొక్కలు నాటి ఔరా అనిపించారు. ఇప్పటికీ వికారాబాద్‌ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ జిల్లాలో అనుకున్న దానికంటే ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో 63.05లక్షల మేర మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా ఇందులో 56.30లక్షల మేర మాత్రమే మొక్కలు నాటారు. ఈసారి మాత్రం ఏమాత్రం తగ్గకుండా లక్ష్యానికి మించి మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందులో ఎంతమేర విజయవంతమవుతారో వేచి చూడాలి….

మొక్కలను కాపాడుకునేందుకు యత్నం…

వేసవి కాలం ప్రారంభమైంది. ఇప్పటికే నాటిన మొక్కలను కాపాడుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్లకు ఇరువైపుల నాటిన మొక్కలను కాపాడుకోవాలంటే సకాలంలో నీళ్లు అందించాల్సి ఉంటుంది.వేసవి సీజన్‌ ప్రారంభమైనందుకు క్రమం తప్పకుండా నీళ్లు అందించాలి. ఈసారి ఎండల ప్రతాపం ఎక్కువగా ఉండనుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నాటిన మొక్కలకు సంరక్షించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మొక్కలు ఎండిపోయాయి. ఉన్న వాటినైనా కాపాడుకోవల్సిన అవసరం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement