Sunday, May 19, 2024

BRS – ముస్లీంల పట్ల కాంగ్రెస్ ది కపట ప్రేమ – కవిత

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)25: ముస్లింల పట్ల బీజేపీ నేరుగా శతృత్వాన్ని ప్రదర్శిస్తుంటే… కాంగ్రెస్ పార్టీ ముస్లింల పట్ల కనిపించని శతృవు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ఆటో టెక్నిషియన్ అసోసియేషన్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి కవిత పాల్గొని ప్రసంగించారు. ముస్లింలకు ఏ పార్టీ అండగా ఉందో, ఏ పార్టీ వాడుకొని వదిలేసిందో ఆలోచించాలని కోరారు. ముస్లీం పట్ల బీజేపీ ఎప్పుడూ శతృత్వాన్ని ప్రదర్శిస్తుందని విమర్శించారు. తెలిసిన శతృవులో టెన్షన్ ఉండదని, కానీ కాంగ్రెస్ పార్టీ వంటి కనపడని శతృవుతోనే సమస్య అని, ముస్లీంల పట్ల కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న వైఖరిని అవలంభిస్తుందని అన్నారు. 55 పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పేదలను పేదరికంలోనే ఉంచిందని విమర్శించారు.

రాహుల్ గాంధీ నానమ్మ నుంచి తండ్రి నుంచి తల్లి, ఆయన వరకు గరీబి హటావో నినాదం ఇస్తూనే ఉన్నారని, కానీ ఎప్పుడూ వాళ్లు పేదరికాన్ని పారద్రోలలేదని ఎండగట్టారు. ఎన్నికలు మన భవిష్యత్తుకు సంబంధించినవని, మంచి పార్టీని, పనిచేస్తున్న వాళ్లను ఎన్నుకోకపోతే ఇబ్బంది పడుతారని తెలిపారు. తెలంగాణ ప్రగతి కొనసాగడానికి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం అవసరమని స్పష్టం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చి అబద్దాలు చెప్పి వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు జమా చేస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. దీనిపై విలేకరు లు ప్రశ్నించగా… అలా హామీ ఇవ్వలేదని అది ఎన్నికల జుమ్లా అని మాటమార్చారని అన్నారు.

అన్ని మతాలను బీఆర్ఎస్ పార్టీ సమానంగా చూస్తుందని చెప్పారు. గత పదేళ్ల కాలంలో ఒక చిన్న మతకల్లోలం జరగకుండా సీఎం కేసీఆర్ పరిపాలన చేశారని చెప్పారు. బిహార్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఆలోచించాలని కోరారు. ఆ రాష్ట్రాల్లో జరుగుతున్నట్లు తెలంగాణలో జరగాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అల్లర్లు జరుగుతూనే ఉన్నాయని, కాబట్టి ఆ రెండు పార్టీలు నాణేనికి బొమ్మ బొరుసు వంటివని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు వేర్వేరు కాదని చెప్పారు. కనిపించని శతృవు పట్ల జాగ్రత్తగా ఉండకపోతే సమస్యలు తప్పవని తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ వంటి అనేక మంది తెలంగాణకు వస్తున్నారని, వారికి స్వాగతం చెప్పి మిఠాయి తిపించి పంపించాలి కానీ అంతకు మించి ఆదరించవద్దని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తే 1969లో 369 మందిని ఇందిరా గాంధీ కాల్పులు జరిపించి చంపించిందని, మలి దశ తెలంగాణ ఉద్యమంకాలంలో వందలాది మందిని కాంగ్రెస్ పార్టీ బలితీసుకుందని గుర్తు చేశారు. వాటిని మరిచిపోదామా అని అడిగారు. .2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల కోసం రూ. 900 కోట్లు మాత్రమే ఇచ్చిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 13 వేల కోట్లు ఇచ్చిందని వివరించారు. మైనారిటీలకు ఉపాధి కోసం శాశ్వత పరిష్కారం దిశగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని వివరించారు. నిజామాబాద్ నగరం లో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరించి కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రెడ్కో మాజీ చైర్మన్ SA అలీం,బి.ఆర్.ఎస్ నాయకులు మీర్ మాజాజ్ అలీ,నవీద్ ఇక్బల్, కరీముద్దీన్ కమల్, ఫయాజ్, అమర్, మతీన్,సన ఉల్లా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement