Monday, May 6, 2024

బాక్సింగ్ చాంపియన్ నిఖత్ కు నీరాజనం.. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘన స్వాగతం

నిజామాబాద్ బ్యూరో, ప్ర‌భ‌న్యూస్ : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ సాధించి తన త‌ర్వాత త‌న‌ సొంత గడ్డ నిజామాబాద్ నగరానికి ఈ రోజు (గురువారం) తొలిసారిగా అడుగుపెట్టిన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్ కు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నిఖత్ జరీన్ రాకతో న‌జామాబాద్ లో సందడి వాతావరణం సంతరించుకుంది. న్యూ అంబేడ్కర్ భవన్ వద్ద రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, షకీల్ ఆమీర్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, నగర మేయర్ నీతూకిరణ్ తదితరులు నిఖత్ జరీన్ కు ఘన స్వాగతం పలికారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి నిఖత్ కు లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని, ఆమెకు బాక్సింగ్ లో ఓనమాలు నేర్పించిన తొలి గురువు అయిన కోచ్ సంసాముద్దీన్ కు యాభై వేల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందించారు.

కాగా, ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించి నిజామాబాద్ కు వచ్చిన తనకు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం పట్ల చాలా ఆనందంగా ఉందని నిఖత్ జరీన్ తన సంతోషాన్ని వ్యక్తపర్చింది. నిజామాబాద్ లోని నిర్మల్ హృదయ్ కాన్వెంట్ లో పాఠశాల స్థాయి విద్యను అభ్యసించిన తాను 2009వ సంవత్సరంలో కోచ్ సంసాముద్దీన్ వద్ద బాక్సింగ్ లో శిక్షణను ప్రారంభించానని నిఖత్ తన కెరీర్ గురించి వివరించింది. ఆ సమయంలో ఇతర బాలికలెవరూ లేకపోవడం వల్ల తాను బాలురతో పోటీ పడాల్సి వచ్చేదని వెల్లడించింది. పట్టుదలతో కృషి చేసి నేడు ప్రపంచ ఛాంపియన్ గా ఎదిగానని పేర్కొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన ప్రోత్సాహం మరువలేనిదని కృతజ్ఞతలు ప్రకటించింది. నిజామాబాద్ జిల్లా పేరును ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా చేయడం చాలా సంతృప్తిని అందించిందని, అందరి తోడ్పాటుతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని నిఖత్ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపర్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement