Thursday, May 16, 2024

సముద్ర స్నానానికి వెళ్లి చిన్నారులు గల్లంతు.. గుంటూరు జిల్లాలో ఘటన

తెనాలి, (ప్రభ న్యూస్) : విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబమంతా సరదాగా గడుపుదామని సముద్ర స్నానానికి వెళితే మృత్యువు అలల రూపంలో చిన్నారులను కబలించింది. గర్భ శోకంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. స్థానిక పాండురంగ పేట హిందూ ముస్లిం బజార్ లో నివాసముంటున్న ఓ ముస్లిం కుటుంబం గురువారం 40 మంది సభ్యులతో కలిసి విహార యాత్రకు నిజాంపట్నం సముద్రతీరానికి వెళ్లారు. 4 రోజుల క్రితం ఆ కుటుంబంలో వివాహం జరగడంతో దూర ప్రాంతం నుండి చాలామంది బంధువులు పెళ్ళికి హాజరై, వివాహానంతరం సరదాగా గడుపుదామని సముద్ర స్నానానికి బయలుదేరారు. స్నానం చేసే సమయంలో అలల రూపంలో వచ్చిన మృత్యువు నలుగురు చిన్నారులను మింగేసింది.

గజ ఈతగాళ్లు, కోస్ట్ గార్డ్ సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ చిన్నారులను కాపాడలేకపోయారు. చనిపోయిన నలుగురిలో రెండు మృతదేహాలు లభ్యం కాగా ఇద్దరు గల్లంతయ్యారు. మృతి చెందిన వారు సుల్తానా (12), అసద్ ఖాన్ (10), మహెజబీన్ (8), షాహిద్ (6) గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారుల మృతితో వివాహం జరిగిన ఇంట విషాదం అలుముకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement