Monday, May 6, 2024

Big Story: నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలు.. నియమించే పనిలో అధినేత కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్‌ సాధించి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పక్కా వ్యూహం రచించే పనిలో నిమగ్నమయ్యారు. శాసనసభ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండడంతో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేసేందుకు సమాయత్తమైనట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో 90 నుంచి 110 స్థానాలను సాధించి తీరుతామని అనేక సందర్భాల్లో ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ఆ దిశగా చర్యలు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల అమల్లో వస్తున్న చిన్న ఇబ్బందులను అధిగమించి లబ్ధిదారులకు ప్రభుత్వ సాయం పూర్తి స్థాయిలో అందేలా చేసేందుకు ఆయన నడుం బిగించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 119 అసెంబ్లి నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించాలన్న నిర్ణయానికి వచ్చారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఇంఛార్జీలుగా నియమితులయ్యే నాయకులు ఆయా నియోజకవర్గాల్లో బస చేసి అసెంబ్లి ఎన్నికల వరకు అక్కడే ఉండి పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులను ఆయా అసెంబ్లి నియోజకవర్గాలకు బాధ్యులుగా నియమించేందుకు కేసీఆర్‌ భారీ స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి దాకా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సీఎం కేసీఆర్‌కు నివేదిక అందడంతో నియోజకవర్గ బాధ్యులను నియమించి వారి ద్వారా పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. స్థానిక ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని నియోజకవర్గ బాధ్యులు పని చేయవలసి ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు సీఎం కేసీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుకు నివేదికలు ఇవ్వాలన్న షరతును విధిస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గ ఇంఛార్జీలుగా నియమితులయ్యే నేతలు పూర్తిగా ఆ నియోజకవర్గాల్లోనే మకాం వేయాలని ప్రత్యేకంగా ఇల్లును తీసుకుని అక్కడే ఉంటూ అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించి లోటుపాట్లను సరిదిద్దాలని ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలను నియోజకవర్గానికి బాధ్యులుగా నిర్ణయిస్తుండడంవల్ల కొన్ని నియోజకవర్గాల్లో లేనిపోని సమస్యలు వచ్చాయని దీంతో ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఎన్నికలయ్యే దాకా ఈ విధానానికి తిలోదకాలిచ్చి ఇంఛార్జీలను నియమించాలన్న నిర్ణయానికి కేసీఆర్‌ వచ్చినట్టు సమాచారం. ఆయా నియోజకవర్గాలకు వెళ్లే నాయకులు ఎమ్మెల్యేలతో వాదులాటకు దిగకుండా సమన్వయం చేసుకుని వారు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ బాధ్యులను నియమించి వారికి తెలంగాణ భవన్‌లో ఒకరోజంతా శిక్షణ ఇవ్వాలని 20వ తేదీ తర్వాత వారంతా తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లి పార్టీ ఆదేశించిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కేసీఆర్‌ కోరనున్నట్టు తెలుస్తోంది.

రేషన్‌ కార్డులు, పింఛన్లు, దళిత బంధు పథకాలపైనే…

క్షేత్రస్థాయిలో చాలా మంది రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేసుకున్నా అవి ఇంత వరకు అందలేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ నిర్వహిస్తున్న సర్వేలలో రేషన్‌ కార్డుల సమస్య తీవ్రంగా ఉన్నట్టు నివేదికలు వచ్చాయి. దీనికి తోడు 57 ఏళ్లు నిండిన వారికి కూడా పింఛన్లు ఇస్తామని గత ఎన్నికల సమయంలో పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. వచ్చే మాసం నుంచి వీరికి పింఛన్లు ఇచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం గ్రామీణ, నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అధికారులతో కలిసి నియోజకవర్గాల బాధ్యులు పని చేయవలసి ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు పథకాలు అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తున్న సీఎం కేసీఆర్‌ ప్రతి ఒక్క అర్హుడికి రేషన్‌ కార్డు, పింఛను అందేలా చూడాలని కోరనున్నారు.

ఏదైనా కారణాలతో పింఛను, రేషన్‌ కార్డు రాని పక్షంలో వారినుంచి దరఖాస్తులు స్వీకరించి అధికారులకు అందజేసి తద్వారా వారికి ఈ రెండు పథకాలు అమలయ్యేలా చొరవ తీసుకోవాలని ఇందులో స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని తెలుస్తోంది. దీంతో పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని కూడా విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల బాధ్యులు పని చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అర్హులైన ప్రతి దళితుడికి ప్రభుత్వం అందజేస్తున్న రూ.10 లక్షల దళిత బంధు చేరేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తారు. ఇప్పటిదాకా ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను సేకరించడంతో పాటు కొత్తగా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సమాచారాన్ని కూడా రాబడతారు. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి దళిత బంధు ద్వారా వచ్చే మొత్తం చేరేలా వీరు చూస్తారు. సంబంధిత అధికారులతో చర్చించి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడి వివరాలు ఇంకేమైనా రావలసి ఉంటే వాటిని అందజేస్తారు.
వచ్చే ఎన్నికలు అత్యంత కీలకంగా భావిస్తున్న సీఎం కేసీఆర్‌ గత ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతంకన్నా వచ్చే ఎన్నికల్లో మెరుగుపడాలని వందకుపైగా అసెంబ్లి స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొత్తగా ఆయా నియోజకవర్గాలకు బాధ్యులుగా ఎంపిక చేస్తున్న నేతలు రాగద్వేషాలకు అతీతంగా పని చేయాల్సి ఉంటుంది. ఒక జిల్లాకు చెందిన వారిని అదే జిల్లాలో కాకుండా మరో జిల్లాలోని అసెంబ్లిd నియోజకవర్గాలకు బాధ్యులుగా నియమించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ నియామకాల్లోనూ సామాజిక వర్గాల వారీగా అందరికీ అవకాశం ఇచ్చేందుకు వ్యూహం రచిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement