Thursday, April 25, 2024

ఆటోమేషన్‌ను ఆశ్రయిస్తున్న ఐటీ కంపెనీలు, ఉద్యోగుల అవసరం లేకుండానే పనుల పూర్తి

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు డిమాండ్‌ పెరగడంతో ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆటోమేషన్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం కొవిడ్‌ సంక్షోభం తలెత్తిన తర్వాత ఐటీరంగం వేగంగా పుంజుకుని రెండంకెల వృద్ధి సాధించడంతో సాఫ్ట్‌వేర్‌ నిపుణుల అవసరం కంపెనీలకు ఎన్నడూ లేనంతగా ఏర్పడింది. దీంతో కంపెనీలన్నీ భారీ స్థాయిలో కొత్త, అనుభవం ఉన్న ఉద్యోగుల నియామకం చేపట్టాయి. ఈ కారణంగా కంపెనీల మధ్య పోటీ నెలకొని అనుభవం, స్కిల్స్‌ ఉన్న ఉద్యోగులకు ఎక్కువ వేతన ప్యాకేజీలిచ్చి ఆకర్షించేందుకు యాజమాన్యాలు సిద్ధపడ్డాయి. ఈ పరిణామాలన్నీ కలగలిసి కంపెనీల మధ్య ఉద్యోగుల వలసలు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో కంపెనీలకు ఉద్యోగుల వేతనాల ఖర్చు కూడా ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. గత ఆర్ధిక ఏడాదికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ విడుదల చేసిన ఐటీ శాఖ వార్షిక నివేదిక వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య ఏకంగాఏడున్నర లక్షలకు చేరిందంటే ఐటీ ఉద్యోగాలు ఏ స్థాయిలో పెరిగాయో అర్ధం చేసుకోవచ్చు. వీటన్నింటి ప్రభావంతో కంపెనీలు భారీగా పెరిగిపోయిన ఉద్యోగుల వేతనాల ఖర్చు తగ్గించుకోవడానికి ఆటోమేషన్‌ సాంకేతికతను ఆశ్రయిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సాంకేతికత ద్వారా పదే పదే చేసే బేసిక్‌ కోడింగ్‌ లాంటి పనులను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సాయంతో ఆటోమేషన్‌ పద్ధతిలో చేయిస్తున్నారు. దీంతో ఈ పనులకు ఉద్యోగుల అవసరం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉద్యోగుల నియామకం విషయంలో కంపెనీలకు కొంత వరకు ఉపశమనం లభిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆటోమేషన్‌ కోసం ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ ఇప్పటికే ఇన్‌హౌజ్‌ ఆటోమేషన్‌ కేంద్రాలను కంపెనీల్లో ఒక విభాగంలా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్‌ అనే ప్రముఖ ఐటీ కంపెనీల కొన్ని వేల సంఖ్యలో బోట్‌లను వినియోగించి ఈ ఆటోమేషన్‌ కార్యక్రమాన్ని ఉద్ధృతంగా చేపడుతున్నట్లు చెబుతున్నారు. ఇదే బాటలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మరిన్ని పేరొందిన ఐటీ కంపెనీలు ఉద్యోగుల అవసరాన్ని తగ్గించుకునేందుకు దీర్ఘకాలిక ఆటోమేషన్‌ ఆధారితవ్యూహాలతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.

హోమ్‌ టౌన్‌లోనే పనిచేసేందుకు ఉద్యోగులకు ఛాన్స్‌..

కొవిడ్‌ తలెత్తినప్పటి నుంచి ఇప్పటివరకు 90 శాతం మంది ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలోనే ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. దీంతో ఆయా ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి చాలా వరకు ఐటీ కంపెనీలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసినందున ఈ మౌళిక సదుపాయాలను వినియోగించుకుని కంపెనీలు తమ ఆఫీసులను అక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకువస్తున్నట్లు ఐటీ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనివల్ల ఆయా కంపెనీల ఉద్యోగులకు తమ ఇంటికి దగ్గరే పనిచేస్తున్నామన్న భావన ఉంటుందని, సమీపంలో ఉన్న కార్యాలయాలకు వచ్చి పనిచేయడానికి వారు మొగ్గు చూపుతారనేది కంపెనీల ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement