Tuesday, May 7, 2024

Followup: ఏడాదిన్నర లోగా 10 లక్షల ఉద్యోగాలు.. తక్షణం ఖాళీలు భర్తీ

దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ప్రధాని మోడీ తీపి కబురు చెప్పారు. వచ్చే ఏడాదిన్నర లోగా కేంద్ర ప్రభుతం పరిథిలోని అన్ని శాఖల్లో పది లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని ఆదేశించారు. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో రెండేళ్లుగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మూలనపడింది. లక్షలాదిమంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ మానవవనరులపై సమీక్షించారు. ప్రస్తుతం కరోనా ప్రభావం బాగా తగ్గిపోవడం, ఆర్థికంగా దేశం పుంజుకోవడంతో తక్షణం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం ఉదయాన్నే ఓ టీట్‌లో ప్రకటించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అగ్నిపథ్‌ పథకాన్ని ప్రకటించే ముందు ఈ ప్రకటన వెలువడటం విశేషం. కరోనా నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు లేకపోవడం, రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో ప్రశ్నపత్రాలు లీక్‌ కావడం, విద్యార్థులపై ప్రభుతం దాడులు చేసిన నేపథ్యంలో తీవ్ర విమర్శలు చెలరేగాయి. రైలే రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరీక్షల్లో అవకతవకలు జరగడం, ప్రత్యేకించి ఇటీవల ఎన్నికలు జరిగిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌, పాట్నా, బీహార్‌లలో నిరుద్యోగులు ఆందోళన చేయడం, వారిపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంవంటి పరిణామాల నేపథ్యంలో మోడీ ప్రభుతంపై పెద్దపెట్టున విమర్శలు వచ్చాయి. ప్రజాందోళనల నేపథ్యంలో ఆర్‌ఆర్‌బీ పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల మనోభావాలను, అసంతృప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రధాని న రేంద్రమోడీ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించారు. అయితే ఏఏ శాఖల్లో ఎన్నెన్ని పోస్టులను భర్తీ చేస్తారన్నదానిపై స్పష్టతనివలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రైలే, త్రివిధ దళాలు, సెంట్రల్‌ పారామిలటరీ బలగాలు, జీఎస్‌టీ శాఖలు, కస్టమ్స్‌, ఎక్సయిజ్‌, పరిపాలనా విభాగం, ప్రభుత బ్యాంకులు, జీవితబీమా సంస్థల్లో ఈ నియామకాలు ఉండొచ్చు.

వెంటనే ఖాళీలు భర్తీ చేస్తాం – హోంశాఖ

అన్ని కేంద్రప్రభుత్వ శాఖల్లో మానవ వనరుల శక్తిని పరిపుష్టం చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదేశానికి అనుగుణంగా చర్యలు తీసుకోబోతున్నట్లు హోంశాఖ ప్రకటించింది. ఖాళీల భర్తీకి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని హోంశాఖ అధికార ప్రతినిధి ట్విట్టర్‌లో ప్రకటించారు. కాగా ప్రధాని నిర్ణయం యువతరంలో భవిష్యత్‌పై ఆశలను చిగురింపచేసి ఉత్సాహాన్ని నింపుతుందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ అన్నారు.

మహాజువ్లూ : రాహుల్‌

ఏడాదిన్నరలో పది లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలన్న ప్రధాని ఆదేశంపై కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌గాంధీ టిట్టర్‌ వేదికగా సెటైర్లు వేశారు. మోడీ ఆదేశం మహాజువ్లూ (అతిశయోక్తి)గా కొట్టి పారేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని నరేంద్రమోడీ ప్రకటించారు. అదేమాదిరిగా ఇప్పుడు ఏడాదిన్నరలో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు. ఇవన్నీ మాటలే. అతిశయోక్తులే. ఇది మహా అతిశయోక్తుల ప్రభుతమని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ఉద్యోగాలు కల్పించలేరు. కాకపోతే ఉద్యోగాల పేరుతో వార్తలను సృష్టించగలరని విమర్శించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement