Sunday, April 28, 2024

Big story : మమత సారథ్యంలో రేపు విపక్షాల భేటీ.. అధినేతలు కొందరే, ప్రతినిధులే ఎక్కువ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఐక్యత చాటే ప్రయత్నానికి నేడు తొలి అడుగు పడనుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ సారథ్యంలో ప్రతిపక్షాలు నేడు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశం కానున్నాయి. విపక్ష పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులు కలిపి మొత్తం 22 మందికి మమత బెనర్జీ ఆహ్వానం పంపగా, వారిలో చాలావరకు అధినేతలు హాజరుకాకుండా తమ తరఫున ప్రతినిధులను ఈ సమావేశానికి పంపిస్తున్నారు. నిజానికి విపక్షాల ఐక్యతను చాటే ప్రయత్నాల్లోనే ఐక్యత కొరవడినట్టుగా కనిపిస్తోంది. జాతీయపార్టీగా ఉన్న కాంగ్రెస్ ఏర్పాటు చేయాల్సిన సమావేశాన్ని హైజాక్ చేసిన చందంగా మమత బెనర్జీ సారథ్యం వహిస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేయడమే కొందరికి నచ్చడం లేదు. ప్రగతిశీల శక్తుల ఐక్యత చాటేందుకు కలసిరావాలని ఆమె ఇచ్చిన పిలుపును అందుకోడానికి సముఖంగా లేనప్పటికీ, తమ అసంతృప్తిని, అసహనాన్ని చాటుకోడానికి ఇది సరైన సమయం కాదని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. అలాగని పార్టీ అధినేతలు హాజరైతే మమత సారథ్యాన్ని అంగీకరించనట్టవుతుందని అనుకుంటున్నారు. అందుకే మధ్యేమార్గంగా తమ తరఫున ప్రతినిధులను పంపించి, మమ అనిపిస్తున్నారు.

ఏకాభిప్రాయం అనివార్యం

రాష్ట్రపతి ఎన్నికలకు బుధవారం (నేడు) నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమతువుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 29 వరకు సమయం ఉన్నప్పటికీ, ఉమ్మడి అభ్యర్థి విషయంలో విపక్షాలు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. ఏకాభిప్రాయం లేకపోతే కనీసం నామినేషన్ దాఖలు చేయడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని కనీసం 50 ఎంపీలు ప్రతిపాదించడంతో పాటు మరో 50 ఎంపీలు సమర్థిస్తూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ నామినేషన్ చెల్లుబాటు కాదు. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రస్తుత సంఖ్యాబలాలను చూస్తే విపక్షాల్లో కాంగ్రెస్ సహా ఏ పార్టీకి సొంతంగా అంతమంది సభ్యులు లేరు. కాబట్టి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం అనివార్యంగా మారింది. ఈ ఏకాభిప్రాయం కేవలం నామినేషన్ వరకే పరిమితమైతే సరిపోదు. ఎన్డీయే కూటమిలో లేని అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తెస్తే తప్ప ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యం కాదు. రాష్ట్రపతి ఎన్నికలకు అవసరమైన ఎలక్ట్రోరల్ కాలేజిలో మెజారిటీ మార్కుకు ఎన్డీయే కొద్ది దూరంలోనే ఆగిపోయింది. తటస్థ రాజకీయ పార్టీలుగా ఉన్న వైఎస్సార్సీపీ, బీజేడీలలో ఏ ఒక్కటి మద్ధతిచ్చినా ఎన్డీయే కూటమి సునాయాసంగా విజయం సాధిస్తుంది. ఈ పరిస్థితుల్లో తటస్థ పార్టీలను సైతం తమ వైపు తిప్పుకుంటే తప్ప ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి విజయం సాధించలేరు. కానీ మమత బెనర్జీ పంపిన ఆహ్వానాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలు లేకపోవడం గమనార్హం.

ఉమ్మడి అభ్యర్థి ఎవరు?

ఉమ్మడి అభ్యర్థిగా నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ పేరునే కాంగ్రెస్ సహా పలు ఇతర పార్టీలు ప్రతిపాదిస్తూ, సమర్థిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను నిర్మొహమాటంగా పవార్ తిరస్కరించారు. తాను రాష్ట్రపతి ఎన్నికల రేసులో లేని తేల్చి చెప్పారు. అయినా సరే, ఆయన్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. సుదీర్ఘ రాజకీయానుభవం, జాతీయస్థాయిలో కూటములను, సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసే చతురత, వివిధ రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు ఆయనుకున్న అర్హతలుగా మారాయి. అయితే ఓడిపోయే ఎన్నికల్లో పోటీచేసి అభాసుపాలుకావడం తమ నేతకు ఇష్టం లేదని ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ శరద్ పవార్ పోటీకి ససేమిరా అంటే మరికొందరిని పరిశీలించవచ్చని తెలుస్తోంది. ఆ క్రమంలో అస్సలు రాజకీయాలతో సంబంధంలేని ఇతర రంగాల ప్రముఖులను సైతం బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదని సమాచారం.

- Advertisement -

ఒక రోజు ముందే ఢిల్లీ చేరుకున్న దీదీ.. ఆ వెంటనే శరద్ పవార్‌తో భేటీ

ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో బుధవారం మధ్యాహ్నం గం. 3.00కు విపక్షాల సమావేశాన్ని ఏర్పాటుచేసిన మమత బెనర్జీ ఒకరోజు ముందుగానే ఢిల్లీ చేరుకున్నారు. ఆ వెంటనే ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసానికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం తమ మధ్య దేశానికి సంబంధించిన అనేకాంశాలపై చర్చ జరిగిందని పేర్కొంటూ ట్వీట్ చేశారు. దేశాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులను ఏకం చేసే విషయంలో మరింత బలం పెరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం జరగనున్న సమావేశానికి ఇద్దరు ప్రముఖ నేతలు (తాను, పవార్) వేదికను సిద్ధం చేశారని ట్వీట్ చేశారు.

ఎవరెవరు హాజరవుతున్నారు?

మమత బెనర్జీ తీరును తప్పుబట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ప్రతినిధులను బుధవారం నాటి సమావేశానికి పంపిస్తోంది. వారిలో రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, మరో సీనియర్ నేత జైరాం రమేశ్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఈ జాబితాలో ఉన్నారు. నిజానికి సోనియా గాంధీనే ఆహ్వానిస్తూ మమత బెనర్జీ లేఖ రాశారు. అయితే సోనియా గాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్ గాంధీ బుధవారం కూడా ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇవేవీ లేకపోయినా సరే గాంధీ కుటుంబం హాజరయ్యే పరిస్థితి ఉండేది కాదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇకపోతే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆ పార్టీలో మరో ముఖ్యనేత ప్రఫూల్ పటేల్ హాజరుకానున్నారు. డీఎంకే నుంచి టీఆర్ బాలు, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం, సీపీఐ(ఎం) నుంచి ఎలమారం కరీం హాజరుకానున్నట్టు ఆయా పార్టీలు వెల్లడించాయి. జాతీయ పార్టీని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్న టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావుకు ఆహ్వానం అందినప్పటికీ, ఆయన హాజరవడం లేదు. కాకపోతే ఆ పార్టీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న కే. కేశవరావు, సీనియర్ నేత బి. వినోద్ కుమార్, మంత్రి జగదీశ్వర్ రెడ్డిని పంపించనున్నట్టు తెలిసింది. మిగతా రాజకీయ పార్టీల నుంచి ఎవరెవరు హాజరవుతారన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement