Friday, May 3, 2024

నిజాంను మరిపిస్తున్న కేసీఆర్ పాలన – భట్టి

.కొలువుల కోసం మరో ఉద్యమం
..పునర్నిర్మాణం అంటే ఫామ్ హౌస్ ల నిర్మాణమేనా..?
..నయా ఫ్యూడల్ వ్యవస్థను నిర్మిస్తున్న కేసీఆర్
..అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
..ఇందిరమ్మ రాజ్యంతోనే సుస్థిర పాలన
..ఆలేరు పౌరుషాన్ని కేసీఆర్ కు తాకట్టు
.. 46వ రోజు కొనసాగిన పీపుల్స్ మార్చ్ ..సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పై శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం పీపుల్స్ మార్చ్ లో భాగంగా ఆలేరు మండలం రాజనగరం పాదయాత్ర శిబిరం వద్ద ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరితో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


తెలంగాణ సంపదను దోపిడి చేసిన సీఎం కేసీఆర్ కుటుంబం రాష్ట్రంలో వెలిగిపోతే తెలంగాణ సమాజం ఎట్లా వెలిగినట్టువుతుందని ప్రశ్నించారు. భారాస పరిపాలనలో ప్రజలు తిండి లేక, ఇండ్లు లేక, పింఛన్లు రాక, కొలువులు లేక అనేక సమస్యలతో అల్లాడిపోతుంటే మైసూర్ ప్యాలెస్ తరహాలో సచివాలయాన్ని కట్టించామని ఇది తెలంగాణకు రాష్ట్రానికి తల మాణికమని, తెలంగాణ వెలిగిపోతుందని సీఎం కేసీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపకుండా తెలంగాణ వెలిగిపోతుందని అనడం సరికాదని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ కుటుంబం, భారాస పెద్దలు మాత్రమే ఈ రాష్ట్రంలో వెలిగిపోతున్నారని విమర్శించారు. బాంచన్ కాల్మోక్త, భూమిపై హక్కు లేనటువంటి నిజాం పాలనలో ప్రజలను దోపిడీ చేసి అత్యంత ధనవంతుడుగా ఎదిగిన నిజాం రాజు ఆనాడు ప్రజలు అహకారాలతో అలమటిస్తున్న రాజ భవనాలు కట్టించుకున్నాడని నేడు కేసీఆర్ కూడా అదే తరహాలో చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రగతిశీల భావంతో కలిగిన సామాజిక తెలంగాణ కావాలని తెచ్చుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నయా ఫ్యూడల్ సాంప్రదాయాన్ని తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తో పాటు ఆయన ఎమ్మెల్యేలు సైతం వందల ఎకరాలు కూడగట్టి ఫామ్ హౌస్ ల పేరిట గడీలు నిర్మిస్తున్నారని అన్నారు. ప్రజల సొమ్మును దోచుకొని దాచుకోవడం కోసం ఆనాడు దొరలు భూస్వాములు గఢీలు నిర్మించుకున్నారని ఇప్పుడు గఢీ అనే పేరు లేకుండా ఫామ్ హౌస్ పేరిట సీఎం కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు దోచుకున్న సంపదను దాచుకోవడానికి ఫామ్ హౌస్ లు ఏర్పాటు చేసుకుంటున్నారని విమర్శించారు.

భూ సంస్కరణలు ల్యాండ్ సీలింగ్ చట్టం తెలంగాణలో ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు‌. తెలంగాణ కూడా దేశంలో అంతర్భాగమేనని ఒక్కొక్కరికి వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ లు ఎట్లా ఉంటాయని ప్రశ్నించారు‌‌. నయా జాగిర్దార్ లు, నిజాందారులను తయారు చేసే విధంగా సీఎం కేసీఆర్ గడీల పునర్నిర్మానం చేయడం మంచిది కాదని, ఇది తెలంగాణ పునర్నిర్మాణం ఎట్లా అవుతుందని కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు
తెలంగాణ తెచ్చుకుంటే కాలు అడ్డం పెట్టుకొని సాగు నీళ్లు పొలాలకు మళ్లించవచ్చని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చే దశాబ్ద కాలమవుతున్న ఎందుకింత నిర్లక్ష్యమని మండిపడ్డారు. తపాస్ పల్లి రిజర్వాయర్ నుంచి దిగువకు సాగునీరు వచ్చే విధంగా కాంగ్రెస్ హయాంలో డిజైన్ చేయగా అధికారంలోకి వచ్చిన భారాస ప్రభుత్వం ఆలేరు నియోజకవర్గానికి నీళ్లు రాకుండా చేయడం దుర్మార్గమైన ఆలోచనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంగా ఆలేరు నియోజకవర్గంలో వేల ఎకరాల్లో సాగునీరు అందకుండా రైతులు పంట నష్టపోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. 1950 సంవత్సరం నుంచి 2014 వరకు ఆలేరు నియోజకవర్గంలో సమస్యలపై రాజీ పడకుండా పోరాటం చేసిన ధీశాలులు పుట్టిన గడ్డ అన్నారు. 2014 లో గెలిచిన ఎమ్మెల్యే ఈ ప్రాంత పౌరుషాన్ని, రాజీ పడని మనస్తత్వాన్ని, ఆలేరు ప్రజల రోషాన్ని స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిందని విమర్శించారు.

ఆలేరు ప్రజలు కోరుకున్నది ఇది కాదని రాజీలేని పోరాటం చేసి ప్రజా సమస్యలను అసెంబ్లీలో గలమెత్తాలని ఓట్లు వేస్తే ఈ ప్రాంత రోషాన్ని తాకట్టు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని అన్నారు.
రూ. 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన అభివృద్ధి పనులు ఏంటో ప్రజలకు తెలియజేసేందుకు ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈ లక్ష్యాలు నెరవేరకుండా కేసీఆర్ అడ్డుగా ఉన్నాడని విమర్శించారు.ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వల్ల 70 సంవత్సరాలు పోరాటం చేసి ఫలితంగా పొందిన హక్కులను వెనక్కి తీసుకువెళ్లిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గత రెవిన్యూ రికార్డులో ఉన్న అన్ని కాలమ్స్ ను పొందుపరిచి, ధరణి వల్ల భూముల పై హక్కులు కోల్పోయిన ప్రతి ఒక్కరికి తిరిగి భూములపై హక్కులు కల్పిస్తామని చెప్పారు. సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ నాయకులు ఆలోచనలు భిన్నంగా ఉంటాయే తప్ప భేదాభిప్రాయాలుగా ఉండయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement