Saturday, May 4, 2024

ADB: కార్మికుల సమ్మెతో నిలిచిపోయిన ఓబీ పనులు

నస్పూర్, ఆగస్టు 12 (ప్రభన్యూస్) : శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి ఓసీ 2, లో కార్మికుల సమ్మెతో గత మూడు రోజులుగా ఓవర్ బర్డెన్ (ఓబీ) పూర్తిగా నిలిచిపోయాయి. ఓబీ కాంట్రాక్టర్ సీఆర్ఆర్ కంపెనీ సైట్ ఇన్చార్జి విష్ణు అత్యుత్సాహం చూపుతూ అప్రకటితంగా కార్మికుల వేతనాల్లో కోతలు విధిస్తూ మానసికంగా వేధించడంతో శనివారం కార్మికులు నిరసన వ్యక్తం చేసి కాంట్రాక్ట్ క్యాంప్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లిన స్పందించకపోవడంతో గత మూడు రోజులుగా పనులను పూర్తిగా నిలిపివేసి వేతనంలో కోత విధిస్తున్న జీతాలను తిరిగి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

యాజమాన్యం స్పందించకుండా వారిపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ప్రతీకార చర్యగా శనివారం క్యాంపులో స్థానికేతర కార్మికులకు భోజనాలు పూర్తిగా నిలిపివేసింది. దీంతో క్యాంపులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా.. స్థానిక తోటి కార్మికులు మానవతా దృక్పథంతో వారికి భోజనం ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ బి.సంజీవరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కార్మికులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కార్మికులు అంగీకరించకపోవడంతో ఈనెల 30 వరకు సీఆర్ఆర్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి మిగతా ఓబీ కాంట్రాక్టర్లు చెల్లిస్తున్న విధంగానే తమకు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement