Monday, April 29, 2024

కుటుంబాలను కబలిస్తున్న మహమ్మారి..

మంచిర్యాల : జిల్లాలో కరోనా వైరస్‌ కోరలు చాచుతోంది. 436 పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మంచిర్యాల, నస్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 29 ఆరోగ్య కేంద్రాల్లో 2138 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 436 మందికి పాజిటీవ్‌గా నిర్దారణ అయింది. గత వారం రోజుల
నుండి కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇప్పటికే కరోనా వైరస్‌ సోకి జిల్లా వ్యాప్తంగా 10మంది మృత్యువాత పడ్డారు. కరోనా మహమ్మారి కుటుంబాలు, కుటుంబాలనే కబలిస్తోంది. ఒకే కుటుంబం నుండి పలువురు మృతి చెందుతుండటంతో మిగతా కుటుంబసభ్యుల జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయి. చిరుద్యోగులు, దినసరి కూలీలు, పేద ప్రజలను ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. కరోనా సోకిన వారు ఒంటరి తనం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. వినియోగదారులు లేక పలు షాపులు, హోటల్స్‌ వెలవెలబోతున్నాయి. షాపుల అద్దెలు, సిబ్బంది వేతనాలను చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నట్లు పలువురు వ్యాపారులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసుల సంఖ్య ఇదేవిధంగా పెరుగుతూ పోతుంటే మరింత ఆర్థికంగా దిగజారే పరిస్థితులు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఒకవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్‌ కోసం వచ్చే వారి సంఖ్య కూడా ఆసుపత్రిలో పెరుగుతోంది. కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో మాత్రం చైతన్యం కనిపించడం లేదు. మాస్కులు ధరించాలని ఒకవైపు ప్రభుత్వం, వైద్యులు, పోలీస్‌ సిబ్బంది ప్రాదేయపడుతున్నప్పటికీ ప్రజలు పట్టించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. సామాజిక దూరం పాటించకపోవడం, విందులు, వినోదాలు, శుభకార్యాలకు యథావిధిగా హాజరవుతుండటంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా బారీన పడ్డ వారు కూడా తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని బయట తిరుగుతున్న పరిస్థితులు కూడా ఉన్నట్లు పేర్కొంటున్నారు. దీంతో ఒకరి నుండి ఒకరికి ఈ సంక్రమణ జరుగుతూ కోవిడ్‌-19 బాధితుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజల్లో మార్పు కనిపించకపోతే కరోనాను అరికట్టడం సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే పరిస్థితులు నెలకొననున్నట్లు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement