Saturday, April 27, 2024

రూ.20లక్షలు చెల్లించాలని కార్మిక సంఘాల డిమాండ్..

మంచిర్యాల: దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో గ్రాట్యూటిని పెంచుతూ 2017లో కోల్‌ ఇండియా యాజమాన్యం ముందుకు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి నోటిఫికేషన్‌ జారీ కాకపోవడంతో అమలు ముగిసిపోయింది. దీంతో సింగరేణి కార్మికులకు పెంచిన గ్రాట్యూటి అమలు కాకపోవడంతో నిరాశగా ఎదురుచూస్తున్నారు. కేంద్రప్రభుత్వం గ్రాట్యూటి చట్టాన్ని సవరిస్తూ రూ.20లక్షలకు పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో 2018 నుండి పదవి విరమణ పొందిన వేలాది కార్మికులకు ఆర్థికంగా భారీ నష్టం జరుగుతోంది. సింగరేణిలో అధికారులకు 2017 నుండి గ్రాట్యూటి చెల్లించాలని వేతన సవరణ సంఘం సూచించింది. 7వ వేతన కమిటీ సిఫారసుల మేరకు కార్మికులకు 2016 నుంచే అమలు చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నప్పటికీ 2017 అక్టోబర్‌ నుంచే గ్రాట్యూటిని పెంచాలని వేతన సవరణ కమిటీ ఒప్పందంలో యాజమాన్యం, కార్మిక సంఘాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో వేలాది మంది పదవి విరమణ పొందుతుండటంతో వారికి పెంచిన గ్రాట్యూటి అందకుండా పోతోంది. సింగరేణి అధికారులతో సమానంగా కార్మికులకు పెంచిన గ్రాట్యూటిని అందజేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గ్రాట్యూటిని పెంచే విషయంలో
కేంద్ర ప్రభుత్వం నుండి గానీ, సింగరేణి సంస్థ నుండి గానీ ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. 7వ వేతన కమిటీ సిఫారసులతో పాటు సతీష్‌ చంద్ర కమీషన్‌ సూచనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేయాల్సి ఉంది. ఒకవైపు వ్రాత పూర్వక ఒప్పందాలు జరుగుతున్నా అమలులో మాత్రం స్పష్టత రాకపోవడంతో కార్మికులు ఆవేదనకు గురవుతున్నారు. వెంటనే కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖతో పాటు సింగరేణి అధికారులు, కార్మిక సంఘాలు గ్రాట్యూటిని రూ.20లక్షలకు పెంచేలా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, కార్మికులు సంవత్సరాల తరబడి వేచి చూస్తున్న నిరీక్షణకు ముగింపు పలకాలని కార్మికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement