Sunday, May 5, 2024

308 కోట్ల నిధులు.. పలు పనులతో పల్లె ప్రగతి సూపర్..

ప్ర‌భన్యూస్ : 2018లో నూతన పంచాయతీ రాజ్‌ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 12,770 గ్రామ పంచాయతీల అభివృద్ధికి పరుగులు పెట్టింది. పల్లెల అభివృద్ధి కోసం 2019లో ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం దేశంలోనే గొప్ప స్కీమ్‌గా పేరు ప్రఖ్యాతులు గాంచిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సంఘం గ్రాంటుకు తోడు అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటును కలిపి ప్రతి నెల రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు వాటి జనాభా ప్రాతిపాదికన నిధులను అందజేస్తోంది. ఇందుకుగాను అన్ని పంచాయతీలకు కలిపి నెలకు రూ.308 కోట్లను పల్లె ప్రగతి నిధులుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ నిధుల్లో భాగంగా ప్రతి గ్రామపంచాయతీకి పరిపాలన ఖర్చుల కింద కనీసం రూ.5 లక్షలు అందజేస్తోంది. గ్రామ పంచాయతీల సమ్మిళిత అభివృద్ధికిగాను అందుబాటులో ఉన్న ఆర్థిక, ప్రకృతి, మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకునే ఉద్దేశంతోనే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

పల్లె ప్రగతిలో భాగంగా పల్లెల్లో రోడ్లు, డ్రైనేజీలను శుభ్రపరచడంతో పాటు శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూల్చివేసి నిర్మాణ వ్యర్థాలను తొలగించడం వంటి ప్రాథమిక పనులను ప్రభుత్వ నిధుల్లో నుంచే చేపడుతున్నారు. ఇప్పటివరకు పలు దశల్లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఒక్క షెడ్డుకు రూ.2 లక్షల 30 వేల ఖర్చుతో చెత్త వేరు చేసే షెడ్లను, రూ.12.5 లక్షల ఖర్చుతో ఘన వ్యర్థాలను తరలించడానికి ట్రాక్టర్ల కొనుగోలు, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా భారీగా మొక్కలు నాటడం వంటి పనులకు నిధులను ఖర్చుచేశారు. ఇవి కాకుండా గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణాన్ని విజయవంతంగా చేపట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పల్లె ప్రగతికిగాను రాష్ట్ర ప్రభుత్వం రూ.2373 కోట్లు విడుదల చేయగా గత 2020-21 ఆర్థిక సంవత్సరంలో పల్లె ప్రగతికి రూ.3079 కోట్లను విడుదల చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement