Saturday, May 4, 2024

మళ్లీ లాక్ డౌన్ తప్పదా?

భారత్ లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తోంది.. దీంతో మరోసారి దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆంక్షలు మొదలయ్యాయి. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ తప్పదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మళ్లీ గత మార్చి పరిస్థితులు ఏర్పడనున్నాయని.. లాక్ డౌన్ అవసరం అవ్వచ్చని కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరుగుతున్నా.. కరోనా మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతోంది. కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే కనిపిస్తున్నాయి. ఇక కేరళ, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుతోంది. ఈ కరోనా కేసుల పెరుగుదల కరోనా సెకండ్ వేవ్ లా అనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది కరోనా అత్యధికంగా ఉన్న సందర్భంలో ఎలాగైతే రోజుకి 20 నుంచి 30 వేల కేసులు వచ్చాయో.. తాజాగా అదే పరిస్థితులు తిరిగి ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలో ఐదు నెలలపాటూ కరోనా కేసులు తగ్గాయి. మళ్లీ ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇందుకు కారణం ఏంటీ అని వెతుక్కోవాల్సిన పనిలేదు. చాలా మంది కరోనా రూల్స్ పాటించట్లేదు అందువల్లే కేసులు పెరుగుతున్నాయి. కొంతమంది ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పండుగల్లో కరోనా కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉంది… తప్పనిసరిగా అందరూ గైడ్‌లైన్స్ పాటించాలి. అందరూ ఫేస్ మాస్కులు ధరించాలి, సేఫ్ డిస్టాన్స్ పాటించాలి. హ్యాండ్ శానిటైజర్లు ఉపయోగించాలి. అలా అందరూ చేసేలా రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలపై కరోనాపై, జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. అందరూ రూల్స్ పాటించేలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.

గతేడాది కరోనా కారణంగా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు లాక్ డౌన్ ని అస్త్రంగా ఎంచుకున్నాం. కానీ ఇప్పుడు లాక్ డౌన్ పెట్టడం సరి కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ అంటే కేవలం నిత్యావసరాలను వదిలి మిగిలిన అన్ని సేవలను ఆపివేయాల్సి ఉంటుంది. గతేడాది లాక్ డౌన్ ఏర్పాటు చేయడం వల్లే ప్రజలు చాలా నష్టపోయారు. అనేక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఇప్పుడు లాక్ డౌన్ పెట్టడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే గతంలో చేసినట్లుగానే ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే అతడు కలిసిన వ్యక్తులందరినీ క్వారంటైన్ చేయడం, ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్, మాస్కుల వంటి పద్ధతులన్నీ పాటించేలా చర్యలు తీసుకోవడం వంటివి చేయడం వల్ల కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రాలు ఈ దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement